Share News

గ్రామానికో యోగా కేంద్రం

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:54 AM

ఇంటింటికీ యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో యోగా కేంద్రాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

గ్రామానికో యోగా కేంద్రం

  • ఇంటింటికీ యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

  • సాంకేతికతకు ఆధ్యాత్మికతను జోడిస్తే తిరుగులేదు

  • ఆగస్టు 15 నుంచి సంజీవని అమలు

  • సంజీవనిలో యోగా.. జంక్‌ ఫుడ్‌ దూరం పెట్టండి

  • వచ్చే ఏడాది తిరుపతిలో యోగాంధ్ర నిర్వహణ

  • భారత శక్తిని ప్రపంచానికి చాటుతున్న మోదీ

  • యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • రాందేవ్‌తో కలిసి ఆసనాలు వేసిన సీఎం, మంత్రులు

రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదు. నేను 30 ఏళ్ల నుంచి యోగాభ్యాసం చేస్తున్నా. రోజూ ఎంతటి పని ఒత్తిడి ఉన్నా యోగా మానసిక ప్రశాంతత, కొత్త శక్తిని ఇస్తుంది. టెక్నాలజీకి ఆధ్యాత్మికత తోడైతే అన్‌ స్టాపబుల్‌. నేటితరం టెక్నాలజీని అక్కున చేర్చుకున్నట్టే.. యోగాను, ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి.

- సీఎం చంద్రబాబు

విజయవాడ, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో యోగా కేంద్రాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబాతో కలిసి పలు యోగాసనాలు వేశారు. ప్రాణాయామం, అనులోమ, విలోమ పద్ధతుల్లో సీఎం చంద్రబాబు యోగా చేశారు. విద్యార్థులు, యువతీ యువకులతో ఇందిరాగాంధీ స్టేడియం నిండిపోయింది. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు కూడా యోగాసనాలు వేశారు. ఉదయం 5 గంటల నుంచే రాందేవ్‌ బాబా యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో రాందేవ్‌ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం మరువలేనిదన్నారు. బాబాతో తనకు 40 ఏళ్లుగా పరిచయం ఉందని, యోగాను ప్రజలకు చేరవేయడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీ చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించిన సంపదని కొనియాడారు. ‘‘ప్రపంచానికి భారత్‌ విశ్వగురు. ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారత్‌ ఒక్కటే. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచేది యోగా. సాంకేతికత, ఆధ్యాత్మికతను అనుసంధానం చేసుకుని వెళ్తేనే భవిష్యత్తు ఉంటుంది. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుంది. వ్యాయామాలు శరీరానికి శక్తినిస్తే, శారీకంగా, మానసికంగా బలంగా ఉంచేది యోగా మాత్రమే. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌ సాధించేందుకు కృషి చేద్దాం.’’ అని సీఎం పిలుపు నిచ్చారు. యో గాను మరింతగా విస్తరించేందుకు ప్రతినెలా రాందేవ్‌ బాబా రాష్ట్రానికి రావాలని కోరారు.


యోగా కోసం ప్రత్యేక పోర్టల్‌

‘‘యోగాంధ్ర-2025 విశాఖలో నిర్వహించి రికార్డులు సృష్టించాం. ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్‌ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించాం. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తాం. 1.33 లక్షల సెంటర్లలో కోటి మందికి పైగా యోగా సాధన చేశారు. ఇంటింటికీ యోగా చేరాలి. ప్రజారోగ్యం బాగుండాలి. ఇదే ప్రభుత్వ లక్ష్యం.’’ అని చంద్రబాబు తెలిపారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామన్నారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పారు. ‘‘స్టాండర్డ్‌ యోగా ప్రొటోకాల్స్‌ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తాం. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేస్తాం. జంక్‌ ఫుడ్‌ వద్దు.. ఫాస్ట్‌ఫుడ్‌ను దూరం పెడదాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. రసాయన రహిత ఆహారాన్ని తీసుకుంటేనే అనారోగ్యం దరిచేరదు. ‘సంజీవని’ ప్రాజెక్టును ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ఈ ప్రాజెక్టుతో వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేసి, సంజీవనిలో యోగాను చేరుస్తాం.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 1.07 కోట్లమంది పౌరులు, 2.5 లక్షల మంది శిక్షకులు యోగాలో పాల్గొన్నందుకు రెండు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్కాయి. వాటిని అధికారులు వేదికపైనే సీఎం చంద్రబాబుకు అందజేశారు.


హైకోర్టులో ఘనంగా యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. యోగా నిపుణుల ఆధ్వర్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, కోర్టు సిబ్బంది యోగాసనాలు వేశారు. ’

ఏపీ భవన్‌లో ఘనంగా యోగాంధ్ర

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో యోగాంధ్ర-2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘యోగ ఫర్‌ హెల్దీ ఏజింగ్‌’ అనే అంతర్జాతీయ ఇతివృత్తానికి అనుగుణంగా ఆదివారం ఉదయం ఏపీ భవన్‌ ప్రాంగణంలో ప్రత్యేక యోగా సెషన్‌ను నిర్వహించారు. ఏపీభవన్‌ ప్రత్యేక కార్యదర్శి ఎ. శ్రీకాంత్‌, ఉన్నతాధికారులు వెంకటరమణ, కదిరి మోహన ప్రభాకర్‌, సురేశ్‌బాబు, సునీల్‌సాగర్‌, భవన్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేసి ప్రాణాయామం చేశారు. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదని, అది మనసు, శరీరం మధ్య సమతుల్యతను పెంపొందించే ఒక జీవన విధానమని శ్రీకాంత్‌ పేర్కొన్నారు. నేటి జీవనశైలిలో యోగా మనకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుందన్నారు.


సునాయాసంగా సీఎం యోగాసనాలు

యోగాభ్యాసంలో భాగంగా రాందేవ్‌ బాబాతో కలిసి వివిధ ఆసనాలను సీఎం చంద్రబాబు సునాయాసంగా వేశారు. ముఖ్యంగా బాబా సమక్షంలో సీఎం వేసిన త్రికోణాసనం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఆసనాన్ని వేయడానికి సహచర మంత్రులు, వేదిక కింద ఉన్న యువకులు ఇబ్బంది పడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం అవలీలగా వేశారు. దీంతోపాటు రాందేవ్‌ బాబా ఆధ్వర్యంలో మరికొన్ని ఆసనాలను వేశారు. సుమారు అరగంటకుపైగా ఆసనాలను వేసినా సీఎం చంద్రబాబులో ఏమాత్రం అలసట కనిపించకపోవడం విశేషం. అనంతరం సమాజహితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో సీఎం ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Jun 22 , 2026 | 06:21 AM