Share News

రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:02 AM

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డుల పంట పండింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి రెండు కేటగిరీల్లో రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి.

రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట

  • పంచాయతీరాజ్‌ శాఖకు ఐదు పురస్కారాలు

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డుల పంట పండింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి రెండు కేటగిరీల్లో రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి. రెండు విభాగాల్లో ప్రథమ, ఒక విభాగంలో ద్వితీయ, మరో రెండు విభాగాల్లో తృతీయ పురస్కారాలు లభించాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ (డీడీయూపీఎ్‌సవీపీ), నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ (ఎన్‌డీఎ్‌సపీఎ్‌సవీపీ) కేటగిరీల కింద రాష్టానికి కేంద్రం అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారాలతో పాటు మొత్తంగా రూ.4.75 కోట్ల నగదును బహుమతి అవార్డు పొందిన పంచాయతీలకు ఇవ్వనున్నారు. డీడీయూపీఎ్‌సవీపీ కేటగిరీ కింద సుపరిపాలనకు సంబంధించి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం పంచాయతీ మొదటి ర్యాంక్‌ సాధించింది. ఈ పంచాయతీకి రూ.కోటి నగదు పురస్కారం అందించనున్నారు. మహిళా స్నేహపూర్వక పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి అగ్రస్థానం లభించింది. ఈ పంచాయతీకి కూడా రూ.కోటి ప్రదానం చేస్తారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు విభాగంలో కడప జిల్లా ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీ రెండో ర్యాంకు (నగదు పురస్కారం రూ.75 లక్షలు) సాధించింది. స్వయంగా మౌలిక వసతులు కల్పించిన పంచాయతీల విభాగంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమల గ్రామ పంచాయతీకి మూడో ర్యాంకు (నగదు పురస్కారం రూ.50 లక్షలు) దక్కింది. ఎన్‌డీఎస్‌పీఎస్‌వీపీ కేటగిరీ కింద మండల స్థాయిలో చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి అవార్డు దక్కింది. మొత్తంగా స్థానికంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మూడో ర్యాంక్‌ సాధించిన ఈ మండలానికి రూ.1.50 కోట్ల నగదు బహుమతి కూడా అందించనున్నారు.


పవన్‌, అధికారులకు సీఎం అభినందనలు

జాతీయ స్థాయి అవార్డులు సాధించిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అత్యుత్తుమ విధానాలు, సంస్కరణలతో శాఖను ముందుకు నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 05:03 AM