Share News

నేడు ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:25 AM

రాష్ట్రంలో అనేకచోట్ల బుధవారం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

నేడు ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు

అమరావతి/విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనేకచోట్ల బుధవారం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 39.5, తిరుపతిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేమగాలులు వీయడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని సాయంత్రం ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలు, కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. గురువారం ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 26, 27 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా.. రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

Updated Date - Jun 25 , 2026 | 03:25 AM