గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 28 , 2026 | 05:16 AM
ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాత్రి కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురవడంతో బుధవారం ఎండ తీవ్రత కాస్త తగ్గింది. దక్షిణ కోస్తాలో వడగాడ్పుల నుంచి కొంతఉపశమనం లభించింది.
అనంతలో రూ.2 కోట్ల పంటనష్టం.. దక్షిణ కోస్తాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
ఉత్తర కోస్తాలో కొనసాగిన వడగాడ్పులు
సాలూరులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత
వడదెబ్బకు నలుగురు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాత్రి కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురవడంతో బుధవారం ఎండ తీవ్రత కాస్త తగ్గింది. దక్షిణ కోస్తాలో వడగాడ్పుల నుంచి కొంతఉపశమనం లభించింది. ఉత్తర కోస్తాలో మాత్రం అక్కడక్కడ వడగాడ్పులు, ఎండ తీవ్రత కొనసాగాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నలుగురు వడదెబ్బతో మరణించారు. అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రూ.2 కోట్ల విలువైన అరటి, బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 80.50 హెక్టార్లల్లో రూ.2కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏలూరు జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో భారీవర్షం కురిసింది. కాగా, బిహార్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. ఆ ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో భిన్నవాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గగా, మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై, వేడిగాలి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 41.8, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరంలలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామ శివారు వీరభద్రపురంలో వృద్ధ దంపతులు ముక్కెల్లి నాగరాజు(65), పుష్ప(61) వడదెబ్బతో మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఇద్దరు వడదెబ్బతో చనిపోయారు. గురువారం కోస్తాలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు, ఎక్కువచోట్ల గాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో 45-46, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 43-44, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, పోలవరం, విశాఖ, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.