Share News

రాష్ట్రంలో రుతు పవన ముందస్తు వర్షాలు

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:51 AM

రాష్ట్రంలో రుతుపవన ముందస్తు వర్షాలకు అనువైన వాతావరణం నెలకొంది. దీనికితోడు దక్షిణ ఒడిశాకు ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది

రాష్ట్రంలో రుతు పవన ముందస్తు వర్షాలు

  • అచ్చెంపేటలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత

అమరావతి, విశాఖపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రుతుపవన ముందస్తు వర్షాలకు అనువైన వాతావరణం నెలకొంది. దీనికితోడు దక్షిణ ఒడిశాకు ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. విదర్భ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో వర్షాలు కురిశాయి. వర్షం కురవని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కావలిలో 43.9, ఉయ్యూరు, నందిగామలో 43.7, కొప్పెరపాడులో 43.6, కుక్కునూరు, నందనమారెళ్లలో 43.4, దొరవానిసత్రంలో 43.3, కారంచేడులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 42-44 డిగ్రీలు, మన్యం, అల్లూరి, ఉభయగోదావరి, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 40-42 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 40డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated Date - Jun 01 , 2026 | 05:52 AM