Share News

ఇక్కడ ఎండ.. అక్కడ వాన

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:46 AM

రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తించగా, మరికొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా వరకు ఉపరితల ద్రోణి...

ఇక్కడ ఎండ.. అక్కడ వాన

  • బెజవాడ నుంచి తిరుపతి వరకు ఠారెత్తించిన భానుడు

  • బాపట్లలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

  • పలుచోట్ల 40 డిగ్రీలు దాటి నమోదు

  • వేపాడలో 9.67 సెంటీమీటర్ల వర్షం

  • పిడుగుపాటుకు 57 మేకలు మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తించగా, మరికొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా వరకు ఉపరితల ద్రోణి... దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించాయి. మరోవైపు ఉత్తర తమిళనాడు నుంచి లక్షద్వీప్‌ వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కువచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా వేపాడలో 9.67, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 7.2, శ్రీసత్యసాయి జిల్లా బుక్కసముద్రంలో 6.9, నర్సీపట్నంలో 6.65, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 6.58, ప్రకాశం జిల్లా టంగుటూరులో 6.44, అనకాపల్లి జిల్లా బలిఘట్టం, రావికమతంలలో 5.77, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో 4.52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పోలవరం జిల్లా వీఆర్‌పురం మండలం రామవరం పంచాయతీ కొప్పల్లి గ్రామంలో పిడుగుపాటుకు 57 మేకలు మరణించాయి. కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, రౌతులపూడి, ప్రత్తిపాడులో వర్షానికి తోడు ఈదురుగాలులు వీచాయి. మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. బాపట్లలో అత్యధికంగా 42.5 డిగ్రీలు, జంగమహేశ్వరపురం, కావలి, ఒంగోలుల్లో 42, అమరావతిలో 41.5, నెల్లూరులో 40.9, గన్నవరంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఎండ తీవ్రత ప్రభావంతో సాయంత్రం నుంచి దక్షిణ, మధ్య కోస్తాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, రౌతులపూడి, ప్రత్తిపాడులో వర్షానికి తోడు ఈదురుగాలులు వీచాయి.


నేడు పలు చోట్ల వర్షాలు

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వేడి వాతావరణం కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, ఈనెల 23వ తేదీ తర్వాతే విస్తరణ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ నెలాఖరున బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. అప్పటివరకూ అడపాదడపా వర్షాలు కురిసి, ఆ తర్వాత వర్షాలు తగ్గుతాయన్నారు. ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమై, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

Updated Date - Jun 18 , 2026 | 03:47 AM