Share News

పిడుగులు పడి ఇద్దరు మృతి

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:06 AM

మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు మరణించగా, కోళ్లఫాం షెడ్డు కూలి మరొకరు మృతి చెందారు.

పిడుగులు పడి ఇద్దరు మృతి

  • కోళ్ల ఫాం షెడ్డు కూలి మరొకరు

  • మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం

  • రాష్ట్రంలో కొనసాగిన ఎండ తీవ్రత

  • కంభం, ఒంటిమిట్టల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత

  • 140 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా నమోదు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు మరణించగా, కోళ్లఫాం షెడ్డు కూలి మరొకరు మృతి చెందారు. కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మార్కాపురం జిల్లాలో గంటపాటు ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో వాన కురవడంతో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. మార్కాపురం రూరల్‌ మండలం బోడపాడు గ్రామానికి చెందిన ఒంటేరు పుల్లమ్మ(47) భర్త కొండయ్య, మరో మహిళ పాసాని రంగలక్షమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లారు. వర్షం ప్రారంభమవడంతో ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపడి పుల్లమ్మ మృతిచెందారు. పొసాని రంగలక్షమ్మకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే, బేస్తవారపేట మండలం గంటాపురం గ్రామంలో మొక్కజొన్న కంకులు గ్రేడింగ్‌ పనులకు వెళ్లిన డోలా శోభారాణి(35) పిడుగుపాటుకు మృతిచెందారు. మార్కాపురం రూరల్‌ మండలం బోడపాడు సమీప పెద్దయాచవరం రోడ్డులోని ఎస్సీ కాలనీలో గాలివానకు కోళ్లఫాం షెడ్‌ కూలి చింతగుంట్ల కుమారి(60) మృతిచెందారు.


పలుచోట్ల వడగాడ్పులు

రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 5డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 140 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా కంభం, కడప జిల్లా ఒంటిమిట్టల్లో 44.3 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.1, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43.8, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.6, పల్నాడు జిల్లా గురజాలలో 43.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42.8, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42.4, కాకినాడ జిల్లా కరపలో 42.3, కర్నూలు జిల్లా నగరడోనలో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదుకానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న ఐదారు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం విజయనగరం, మన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Updated Date - Apr 29 , 2026 | 05:07 AM