‘సర్’తో ప్రక్షాళన!
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:16 AM
ఒక్క ఓటు తేడాతో ఎన్నికల ఫలితం మారిపోతుంది. పదులు, వందలు, అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినవారు ఎందరో ఉన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే దాని ప్రభావం ఫలితంపై ఉంటుంది.
44.89 లక్షల ఓట్లు అవుట్
మృతులు, వలసలు, డబుల్ ఎంట్రీలు.. ఇవన్నీ తొలగింపు జాబితాలోకి
ఇక దొంగ ఓట్లకు చెక్ పడినట్టే
ఫలితాల్లో అడ్డగోలు ‘తారుమార్ల’కు ప్రక్షాళనతో కళ్లెం
31న ముసాయిదా జాబితా
ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబరు 3న తుది జాబితా
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
ఒక్క ఓటు తేడాతో ఎన్నికల ఫలితం మారిపోతుంది. పదులు, వందలు, అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినవారు ఎందరో ఉన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే దాని ప్రభావం ఫలితంపై ఉంటుంది. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తోంది. రాష్ట్రంలో ఏకంగా 44.89 లక్షల ఓట్లు గుర్తించలేనివి(అన్‌కలెక్టబుల్)గా తేలింది. వీటిలో మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డబుల్ ఎంట్రీల ఓట్లు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగింపు జాబితాలో పెట్టారు. దీనివల్ల ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం ఉండదు. అవకతవకల కారణంగా స్వల్ప తేడాతో ఎన్నికల ఫలితం తారుమారు అయ్యే అవకాశం కూడా ఉండదు. చివరిసారిగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాల ప్యూరిఫికేషన్ లేదు. 2026 మే 25 నాటి వరకు ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, ఈ ఫారాలు తిరిగి ఇచ్చింది 3,71,38,206(89.22శాతం) ఓటర్లు మాత్రమే. అంటే.. 44,89,488 (10.78ు) ఫారాలు అన్‌కలెక్టబుల్‌గా ఉన్నాయి.
ఇవీ లెక్కలు
సర్ ప్రక్రియలో బీఎల్‌వోల ఇంటింటి సర్వేతో వాస్తవాలు బయటకు వచ్చాయి. అన్‌కలెక్టబుల్ ఫారాలు 44.89 లక్షల్లో మరణించిన ఓటర్ల సంఖ్య 15 లక్షలకుపైగా ఉంది. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు 14 లక్షలకుపైగా ఉన్నారు. వీరి ఓట్లు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. మరో 7 లక్షల మందికిపైగా రెండుచోట్ల ఓట్లు ఉన్నాయి. అంటే.. ఇప్పటివరకు వీరు రెండుచోట్లా ఓటు వేయడం కానీ వీరి పేరుతో మరొకరు దొంగ ఓటు వేసే అవకాశం కానీ ఉన్నాయి. తాజా ప్రక్రియతో వీటికి అడ్డుకట్ట వేసినట్టయింది. మరో విచిత్రం ఏంటంటే.. బీఎల్‌వోల ఇంటింటి సర్వేలో 7 లక్షల మంది ఎక్కడ ఉన్నారో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. అంటే.. శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు, రెండుచోట్ల ఉన్నవారు, అసలు ఎక్కడ ఉన్నారో తెలియని ఓటర్ల ఓట్లు కలుపుకొంటే.. మొత్తం సుమారు 28లక్షల ఓట్లు జాబితాలో ఉన్నాయి. సర్‌తో వీటికి చెక్ పడింది. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోల ఇంటింటి సర్వే ప్రక్రియ శుక్రవారంతో పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో ఓట్ల వివరాలు విడుదల చేశారు. 44,71,523 (మొత్తం ఓట్లలో 10.75 శాతం) ఓట్లు తొలగింపు జాబితాలో పెట్టినట్లు స్పష్టం చేశారు. వీటిని అన్‌కలెక్టబుల్ (వివరాలు రావడానికి అవకాశం లేని ఎన్యుమరేషన్ ఫారాలు) జాబితాలో పెట్టారు. ఈ నెల 31న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఈ ఓటర్ల పేర్లు తొలగిస్తారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అదే రోజు నుంచి ఓటర్ల నుంచి అభ్యంతరాలు, క్లైములు ఆగస్టు 30వ తేదీ వరకు నెల రోజుల పాటు స్వీకరించనున్నట్లు సీఈవో వివేక్ యాదవ్ తెలిపారు. నోటీసుల దశ, క్లైములు అభ్యంతరాల పరిష్కారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 28 వరకూ ఉంటుందని, అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు.
మ్యాపింగ్ కానివి.. తప్పులు
రాష్ట్రంలో 2002 నాటి ఓటర్ల జాబితాతో సరిపోలని ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలు 7,56,695 లక్షలు ఉన్నాయి. వీరికి ముసాయిదా జాబితా విడుదల తర్వాత నోటీసులు ఇస్తారు. వారు తమ సరైన వివరాలను లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి సరి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక డిజిటలైజేషన్ అయిన 36,68,979(9.12 శాతం) ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల్లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. 2002 నాటి సర్ ఓటరు జాబితాల్లో ఉన్న వారు, వారి బంధువుల వివరాలకు సరిపోల్చినప్పుడు ఇంటి పేరు, ఓటరు పేరు, వయసు, నమోదు, ఇతర వివరాల్లో స్పల్ప తప్పులు గుర్తించారు. ఈ నెల 31 తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత వారికి నోటీసులు జారీ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ పరిశీలించి చేసి వివరాలను సరి చేస్తారు. సర్ ప్రక్రియతో ఓటర్ల జాబితాలు దాదాపుగా ప్రక్షాళన కానున్నాయి.