Share News

ఆన్‌లైన్‌లోను ఎన్యూమరేషన్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:44 AM

రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఆన్‌లైన్‌లో కూడా తమ ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించే..

ఆన్‌లైన్‌లోను ఎన్యూమరేషన్‌

  • బీఎల్‌వోల కోసం వేచి చూడకుండా ఫారం పూర్తిచేసి సమర్పించే చాన్స్‌

  • చిన్నపాటి సూచనలు పాటిస్తే ఫారం నింపడం కష్టమేమీ కాదు

  • ఈ అవకాశం వినియోగించుకోవాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌

  • ఓటర్లకు రెండు రోజుల్లోనే 25.5 లక్షల ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఆన్‌లైన్‌లో కూడా తమ ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బూత్‌ స్థాయి అధికారు(బీఎల్‌వో)లు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, బీఎల్‌వోలు వచ్చి ఫారాలు అందజేసే వరకు వేచి చూడకుండా.. ఆన్‌లైన్‌లో కూడా ఫారాలు సమర్పించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గత ప్రాథమిక ఓటరు జాబితా ఆధారంగా వివరాలను ధృవీకరించి ఫారాన్ని సమర్పించవచ్చని తెలిపింది. అయితే ఆన్‌లైన్‌లో ఈ సైన్‌(ఈ-సంతకం) ద్వారా ఫారాన్ని సమర్పించడానికి ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు పాటించాలని స్పష్టంచేసింది.

ఇవి కావాలి..

  • ఓటరు ఐడీ(ఈఎపిక్‌)తో మొబైల్‌ నంబరు అనుసంధానమై ఉండాలి.

  • ఓటరు ఐడీలోని పేరు, స్పెల్లింగ్‌, ఓటరు ఆధార్‌ కార్డుతో కచ్చితంగా సరిపోలాలి. ఏదైనా వ్యత్యాసం ఉంటే డిజిటల్‌ ఈ-సైన్‌ విఫలం అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఓటరు తమ బీఎల్‌వో ద్వారా ఫారం సమర్పించాలి.


ఇలా నింపాలి..

ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక ఓటరు సర్వీస్‌ పోర్టల్‌, లేదా ఈసీఐనెట్‌ మొబైల్‌ యాప్‌లో లాగిన్‌ అయి ‘ఫిల్‌ ఎన్యూమరేషన్‌ ఫారం’ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం రాష్ట్రాన్ని ఎంపిక చేసి, 10 అంకెల ఓటరు ఐడీ సంఖ్యను నమోదు చేయాలి. వివరాలు ధృవీకరించిన తర్వాత నమోదిత మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే ఫారం పూర్తి చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఓటరు తన వివరాలను గత ఎస్‌ఐఆర్‌(2002) జాబితాలతో అనుసంధానించేందుకు మూడు కేటగిరీల్లో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 1. గత ఎస్‌ఐఆర్‌లో ఓటర్ల జాబితాలో నా పేరు ఉంది. 2. గత ఎస్‌ఐఆర్‌లో నా తల్లిదండ్రుల(తండ్రి, తల్లి, తాత, నాయనమ్మ, అమ్మమ్మ) పేరు ఉంది. 3. గత ఎస్‌ఐఆర్‌లో నా పేరు గానీ, నా తల్లితండ్రుల పేరుగానీ లేదు. ఈ వివరాల కోసం ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ లాస్ట్‌ సర్‌’ అనే ఆప్షన్‌ను వినియోగించి వివరాలు పొందవచ్చు. ఈ తర్వాత ఎన్యూమరేషన్‌ ఫారంను ఓటరు వివరాలతో నింపాలి. పాత ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వారి కుటుంబ సభ్యుల పేరు ఉంటే, చట్టపరమైన లింకేజీని ఏర్పరచడానికి బంధువు పేరు, రిలేషన్‌, పాత నియోజకవర్గం, పార్ట్‌ నంబరు, వివరాలను నమోదు చేయాలి. ఓటరు అవసరమైతే తమ పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేయవచ్చు. లేదా ఇటీవల పాస్‌పోర్టు ఫోటోను అప్‌లోడ్‌ చేయవచ్చు. ఎన్యూమరేషన్‌ ఫారం నింపిన తర్వాత అక్షర దోషాలను సరిచేసేందుకు, వివరాలను సమీక్షించడానికి ‘ప్రివ్యూ బటన్‌’పై క్లిక్‌ చేయాలి. అంతా ఖచ్చితంగా ఉంటే, డిక్లరేషన్‌ చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేసి సబ్‌మిట్‌ చేయాలి. ఆ తర్వాత ఆధార్‌-ఈసైన్‌ ద్వారా డిజిటల్‌ సంతకం చేసి ఫారాన్ని సమర్పించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

ఫారాల పంపిణీ జోరు

రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలను అందిస్తున్నారు. మంగళవారానికి(రెండురోజుల్లో) రాష్ట్ర వ్యాప్తంగా 25,54,101 ఫారాలను ఓటర్లకు అందించారు. వీటిలో 30,487 ఫారాలను డిజిటలీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

Updated Date - Jun 17 , 2026 | 04:45 AM