సామాన్యులకు కూర‘గాయాలు’
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:10 AM
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లలో చాలా రకాల కూరగాయలు కిలో రూ.50పైనే పలుకుతున్నాయి.
ఎక్కువ రకాలు కిలో రూ.50పైనే
వానాకాలం వచ్చినా.. తగ్గని ధరలు
రిటైల్ కన్నా.. రైతుబజార్లలో కొంచెం తక్కువ
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లలో చాలా రకాల కూరగాయలు కిలో రూ.50పైనే పలుకుతున్నాయి. ఎండాకాలంలో దిగుబడి తగ్గుదలతో సరుకు లేక ధరలు పెరగడం సహజమే. కానీ వేసవి కాలం ముగిసినా, అడపాదడపా వర్షాలు పడుతున్నా.. కూరగాయల ఉత్పత్తి పుంజుకున్నా.. కొన్ని రకాల ధరలు మాత్రం తగ్గడం లేదు. క్యాప్సికం రూ.120, చిక్కుళ్లు రూ.100, క్యారెట్ రూ.80, బీట్రూట్ రూ.60పైనే చెబుతున్నారు. కొనుగోలు తక్కువగా ఉండే కంద, పెండలం కూడా రూ.60కి తగ్గడం లేదు. పచ్చిమిర్చి రూ.60 ఉండగా, బజ్జీ కాయలు రూ.100దాకా పలుకుతున్నాయి. చామదుంప, బీర, కాకర, పొట్ల, గోరుచిక్కుడు కిలో రూ.50 చొప్పున అమ్ముతున్నారు. టమాటా, వంకాయ, క్యాబేజీ, దోస, బెండ, దొండకాయలు రూ.40దాకా చెబుతున్నారు. రూ.50 లోపున్న ఈ రకాల సరుకు నాణ్యంగా ఉండట్లేదు. బంగాళదుంప రూ.30-40 ఉండగా, మునక్కాయ రూ.10-15, ఆకుకూర కట్ట రూ.10 చొప్పున అమ్ముతున్నారు.
అల్లం, వెల్లుల్లి ధరలూ పైపైకే!
కూరల్లో వాడుకునే నిత్యవసరాలైన అల్లం, వెల్ల్లుల్లి ధరలు కూడా గత నెల రోజుల్లో బాగా పెరిగాయి. గత నెలలో కిలో అల్లం రూ.140, వెల్లుల్లి రూ.150 ఉండగా, ప్రస్తుతం అల్లం రూ.220, వెల్లుల్లి రూ.200దాకా పలుకుతున్నాయి. రైతుబజార్లలో మాత్రం కిలోకి రూ.10-20 తక్కువగా ఉన్నాయి. రైతు బజార్లు పట్టణ ప్రాంతాల్లో ఒకటీ, రెండు మాత్రమే ఉండగా, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు రిటైల్ మార్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదనుగా కొన్ని రిటైల్ దుకాణాల వ్యాపారులు కిలోకి రూ.20పైనే అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమంటే రవాణా ఖర్చులు, తరుగులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ రెండో వారం నుంచి వర్షాలు చెదురుమదురుగా పడుతూనే ఉన్నాయి. దీంతో ఎండలు తగ్గడంతో కూరగాయల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద కొత్త తోటలు వేస్తున్నారు. కాలువలకు సాగునీరు విడుదల చేస్తుండటంతో లంక గ్రామాల్లో కూరగాయల సాగు పుంజుకుంది. ఇంకోవైపు గత నెల రోజులుగా అధిక మాసం వల్ల శుభకార్యాలు పెద్దగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో డిమాండ్ లేకున్నా.. కూరగాయల ధరలు తగ్గకపోవడానికి రిటైల్ వ్యాపారుల ధనాశే కారణమని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని సరుకుకు కూడా డిమాండ్ సృష్టించి విక్రయిస్తున్నారని చెబుతున్నారు. కూరగాయల ధరలపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో రిటైలర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారని వినియోగదారులు పెదవివిరుస్తున్నారు.