ప్రధాన విమానయాన కేంద్రంగా అమరావతి!
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:43 AM
రాష్ట్రంలో విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భారీ నజరానాలతో కూడిన ప్రోత్సాహకాలను అందజేసే విమానయాన పాలసీని రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది.
ప్రత్యేక ప్రోత్సాహకాలు, నజరానాలతో ఏవియేషన్ పాలసీ
రాష్ట్ర మౌలిక వసతుల శాఖ ఉత్తర్వులు
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భారీ నజరానాలతో కూడిన ప్రోత్సాహకాలను అందజేసే విమానయాన పాలసీని రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ విధానంపై రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శనివారం ఉత్తర్వు జారీ చేశారు. విమానాశ్రయాల అభివృద్ధి, ఎయిర్‌లైన్స్, కనెక్టివిటీ, ఎయిర్‌కార్గో, మెయింటినెన్స్-రిపేర్-ఆపరేషన్ (ఎంఆర్‌వో), ఏరోస్పేస్, హెలికాప్టర్లు, సీప్లేన్లు, సాధారణ విమానయానం, వాటర్ డ్రోమ్స్, విమానయాన నైపుణ్యాభివృద్ధి, అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ, విమానయాన సుస్థిరత, పరిశోధన అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీని తీసుకొచ్చినట్లు అందులో వెల్లడించారు. రాష్ట్ర విమానాశ్రయాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం.. అమరావతిని ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడం, రాష్ట్రంలోని విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించడమే పాలసీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రోత్సాహకాలివీ..
రాష్ట్రంలో విమానాలను నడిపే సంస్థలకు తొలి మూడు సంవత్సరాల్లో పార్కింగ్ అండ్ ల్యాండింగ్ చార్జీలను రీయింబర్స్ చేస్తారు. కొత్త దేశీయ రూట్లకు అవసరమైన ఆర్థిక లోటును ప్రభుత్వం భర్తీ చేస్తుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)ను అవసరమైన మేరకు అందిస్తుంది. స్థిర మూలధన పెట్టుబడిపై 20 శాతం రాయితీ ఇస్తారు. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఐదు వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. సామర్థ్యం అభివృద్ధి, ఉపాధి లక్ష్యాల సాధనకు అదనంగా పదిశాతం పెట్టుబడి రాయితీ లభిస్తుంది. యాంకర్ ఎంఆర్‌వో కోసం అదనంగా మూడు శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. విమానాశ్రయాలు, వాటర్ డ్రోమ్‌ల కోసం రెవెన్యూ షేర్, లీజులు, లైసెన్సు ఫీజుల్లో అవసరాన్ని బట్టి సడలింపులు ఉంటాయి. కన్సెషన్ ఒప్పందంలో భాగంగా అన్ని ప్రాజెక్టు ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు దక్కుతుంది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన విమానయాన కోర్సులు చేసిన వారికి శిక్షణ వ్యయంలో 50 శాతం లేదా రూ.పది వేలు అందిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రతిభావంతులైన మహిళలకు శిక్షణ వ్యయం పూర్తి ఉచితం. ఫ్లైట్ సిమ్యులేషన్ సెంటర్లకు స్థిర మూలధన పెట్టుబడిపై 18 శాతం వరకూ సబ్సిడీ ఉంటుంది.