యూనివర్సిటీ పోస్టులకు 5206 దరఖాస్తులు
ABN , Publish Date - May 22 , 2026 | 05:17 AM
విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేయగా అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది.
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేయగా అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. నాలుగు రోజుల్లోనే 4545 మంది అభ్యర్థులు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు. 9362 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వివరాలు సమర్పించారు. అంటే సగటున ఒక్కో అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వివరాలు సమర్పించిన అనంతరం 1069 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేశారు. 3185 దరఖాస్తులకు ఫీజు సర్దుబాటు చేశారు. 2023 నోటిఫికేషన్ల సమయంలో దరఖాస్తు చేసుకుని, ఫీజు చెల్లించినందున ఇప్పుడు ఆ ఫీజును సర్దుబాటు చేశారు. మొత్తంగా ఇప్పటివరకూ 9362 పోస్టులకు అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోగా వాటిలో 5260 పోస్టులకు తుది దరఖాస్తులు అందాయి. కాగా జూన్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు గడువు ఉంది. ఆ తర్వాత దరఖాస్తు హార్డ్ కాపీలను అభ్యర్థులు సంబంధిత యూనివర్సిటీలకు జూన్ 15 వరకు పంపాలి.