రాష్ట్రాభివృద్ధికి చోదకశక్తిగా పర్యాటకం
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:46 AM
రాష్ట్రంలో నూతన పర్యాటక విధానం ద్వారా రూ.20వేల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
రెండేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
పర్యాటకుల భద్రత కోసం బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్
త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ.. నంది అవార్డులు: దుర్గేశ్
అమరావతి/విజయవాడ అర్బన్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నూతన పర్యాటక విధానం ద్వారా రూ.20వేల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. పబ్లిక్- ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాకు వివరించారు. పర్యాటక రంగాన్ని రాష్ట్రాభివృద్ధికి చోదకశక్తిగా మార్చి భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో విప్లవాత్మక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ 2024-29 వంటి వాటితో 117 ప్రముఖ సంస్థలతో ఎంవోయూలు కుదర్చుకుని దాదాపు రూ.20 వేల కోట్ల భారీ పెట్టుబడులకు కృషి చేశామని మంత్రి వివరించారు. దీనిద్వారా 1,22,637 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని ఎనిమిది పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.428 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. వాటిలో సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు, బొర్రా గుహలకు రూ.29.87 కోట్లు, అఖండ గోదావరి పునరుద్ధరణకు రూ.94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ.77.91 కోట్లు, అన్నవరం దేవస్థానానికి రూ.25.32కోట్లు, సింహచలం దేవస్థానానికి రూ.54.04 కోట్లు చొప్పున కేంద్రం అందించిందని వివరించారు.
సీబీడీడీ కింద ‘అహోబిలం- ఏ స్పిరిట్చువల్ ఒడిస్సీ’కి రూ.24.96 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్‌కు రూ.25 కోట్లు మంజూరయ్యాయని, వీటిని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సినిమా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. మళ్లీ నంది అవార్డులను ప్రారంభించనున్నట్లు దుర్గేశ్ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. పవన్‌కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని సంస్కారహీనుడని దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండలో అనారోగ్యంతో ఉన్న చిన్నారిని పవన్ పరామర్శిస్తే, దానిపై పేర్ని చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని మండిపడ్డారు.