Share News

పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

ABN , Publish Date - May 13 , 2026 | 05:29 AM

ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు.

పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

  • ఆతిథ్య రంగానికి పారిశ్రామిక హోదాకు కృషి

  • పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌

బాపట్ల, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్‌ కింద జరుగుతున్న అభివృద్ధి పనులను మరో మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. తీరంలో అడ్వెంచర్‌ టూరిజంను ప్రమోట్‌ చేసే కార్యక్రమంలో భాగంగా జెట్‌స్కీ రైడ్స్‌, బైక్‌రైడ్స్‌తో పాటు వాటర్‌ జార్బింగ్‌ వంటి వాటిని మంత్రులు ప్రారంభించారు. సూర్యలంక బీచ్‌ బ్రాండ్‌ లోగోను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ.. సూర్యలంక తీరం అభివృద్ధికి కేంద్రం రూ.98 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే చీరాల వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్స్‌ జరుగుతున్నాయని, సూర్యలంకలో కూడా జరుగుతాయని అన్నారు. షూటింగ్‌ జరిగిన ప్రాంతం పేరును సబ్‌టైటిల్స్‌లో వేస్తే టూరిజానికి ప్రచారం లభిస్తుందన్నారు. గోవాను మరిపించేలా సూర్యలంకను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పాల్గొన్నారు.

సమన్వయం ఏదంటూ మంత్రుల ఆగ్రహం

స్వదేశీ దర్శన్‌ కింద సూర్యలంక తీరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఏపీటీడీసీ అధికారులతో మంత్రులు దుర్గేశ్‌, అనగాని సమీక్ష జరిపారు. పనుల పురోగతి విషయంలో నిర్దిష్ట గడువు పెట్టుకుని పనిచేస్తున్నట్లు కనబడడం లేదని, ఆయా విభాగాల మధ్య సమన్వయం కనబడడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - May 13 , 2026 | 05:29 AM