ఈ వేసవి మరింత ‘హాట్’!
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:52 AM
ఈసారి వేసవిలో ఎండలు ‘మంట’ లు రేపనున్నాయి! దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని...
మార్చి నుంచి మే వరకూ ఎండల మంటలు
(విశాఖపట్నం/అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఈసారి వేసవిలో ఎండలు ‘మంట’ లు రేపనున్నాయి! దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థలు వెల్లడించాయి. మార్చి నుంచి మే మధ్య ఉత్తరాంధ్ర తప్ప రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి నెలలో ఉత్తర, మధ్య కోస్తా వరకు సాధారణంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణాంధ్రలో సాధారణం కన్నా ఎక్కువ రోజుల పాటు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు.
దేశంలో పరిస్థితి ఇదీ..
మార్చి ప్రారంభం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్రలో మధ్యనున్న ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయి. ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ భారతంలోని తమిళనాడు నుంచి మధ్య, తూర్పు భారతంలో బిహార్, దానికి ఆనుకుని తూర్పు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, గుజరాత్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాల్లో అనేక రోజులు వడగాడ్పులు కొనసాగనున్నాయి. మార్చి నుంచి మే వరకు ఉత్తర కోస్తాంధ్ర, దానికి ఆనుకుని తెలంగాణ, తూర్పు రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
బలహీనమవుతున్న లానినా
ఇదిలా ఉండగా ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో బలహీనమైన లానినా కొనసాగుతోంది. దీని ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు, మధ్య ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో లానినా బలహీనపడుతుందని అంతర్జాతీయ వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలో పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ఏర్పడుతాయని, దీంతో దేశంలో ఎండలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వేసవిలో ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.