రాష్ట్రంలో నీతిమంత పాలన
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:34 AM
ఈ ఏడాది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జాతకం బలహీనంగా ఉందని పంచాంగకర్త పిడపర్తి సుబ్రహ్మణ్యశాస్ర్తి ఆయన సమక్షంలోనే వెల్లడించారు.
ప్రజలు సుఖంగా ఉంటారు
జగన్ జాతకం మాత్రం ‘వీక్’
వైసీపీ పంచాంగకర్త వెల్లడి
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జాతకం బలహీనంగా ఉందని పంచాంగకర్త పిడపర్తి సుబ్రహ్మణ్యశాస్ర్తి ఆయన సమక్షంలోనే వెల్లడించారు. రాష్ట్రంలో రాజులు నీతిమంతంగా పరిపాలన చేస్తారని తెలిపారు. ఉగాదిని పురస్కరించుకుని గురువారం తాడేపల్లి ప్యాలె్‌సలో శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం జరిగింది. జగన్ దంపతులు హాజరయ్యారు. పంచాంగకర్త పిడపర్తి రాశి ఫలాలను చదివారు. జగన్ నక్షత్రం ఆరుద్ర.. మిథున రాశి అని.. ఈ రాశి వారికి ఈ ఏడాది సామాన్య ఫలితాలే ఉంటాయని.. వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతాయని.. ఆ పై ఏడాది ఇంకొద్దిగా మెరుగవుతాయని చెప్పారు. ఆయన జాతకం బలహీనంగా ఉన్నా.. ఆయన భార్య భారతి జాతకం (రోహిణి నక్షత్రం-మృగశిర రాశి) బలంగా ఉందని.. ఆ ప్రభావంతో జగన్ అనుకున్నవి జరిగే అవకాశముందని తెలిపారు. ‘రాష్ట్రంలో వైరస్వభావం లేకుండా రాజులు పాలన చేస్తారు.. భూమి ధరవరలతో నిండి ఉంటుంది. గురుడు రాజ్యాధిపతి కావడంతో ప్రజలు ఈ ఏడాదంతా ధర్మకార్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు. రాజులంతా నీతిమంతులై పరిపాలన చేస్తారు.. ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖంగా, సుభిక్షంగా ఉంటారు’ అని వివరించారు. పంటలు పుష్కలంగా పండుతాయని.. చిరుఽధాన్యాల దిగుబడి గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్నారు. చివరిలో పండితుల నుంచి జగన్ దంపతులు ఉగాది పచ్చడి స్వీకరించారు. పంచాంగ శ్రవణానికి ముందే.. జగన్ రాశిఫలాలను సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పానని పిడపర్తి వెల్లడించారు. అయితే కొందరునేతలు తమ అధినేత రాశిఫలాలు వెల్లడించాలని కోరారు. ఆయన జాతకం సాధారణంగా ఉందని పిడపర్తి చెప్పడంతో వారు దిగాలుపడ్డారు. అలాగే పంచాంగ శ్రవణం జరుగుతున్నంత సేపూ జగన్ సీరియ్‌సగా కనిపించారు. ప్రదక్షిణ చేయాలని పండితులు సూచించినా పాటించలేదు.