నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగాలు
ABN , Publish Date - May 13 , 2026 | 04:47 AM
ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ద్వారా నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలను నేర్పించి ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని...
స్కిల్ కార్పొరేషన్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ: మంత్రి సత్యకుమార్
గుంటూరులో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
గుంటూరు మెడికల్, మే 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ద్వారా నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలను నేర్పించి ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఏపీ నర్స్, మిడ్‌వైఫరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమెరికా, గల్ఫ్, ఆఫ్రికా దేశాలు, కొరియా, జర్మనీ, జపాన్‌లో మన దేశ నర్సులకు ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే మన రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలు నేర్పిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, రోగుల సంతృప్త స్థాయి 62 శాతం నుంచి 74.5 శాతానికి పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్న 15 వేల మంది నర్సులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీ వైద్య రంగం క్యూరేటివ్ మెడిసిన్‌పై (వ్యాధుల నివారణ) దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. నర్సింగ్‌లో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును మంత్రి ప్రదానం చేశారు. బెస్ట్ నర్స్ రీసెర్చర్ అవార్డును డాక్టర్ బి.వనజకుమారి(నెల్లూరు), బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటర్ అవార్డును డాక్టర్ సీఆర్ షంషేర్(విజయనగరం), బెస్ట్ నర్స్ ఎడ్యుకేటర్‌గా డాక్టర్ కె.సుగంధి (మచిలీపట్నం), బెస్ట్ నర్సింగ్ సర్వీసెస్ అవార్డును హెడ్ నర్స్ ఎస్ చిన్నమ్మి (శ్రీకాకుళం), బెస్ట్ ఏఎన్‌ఎం అవార్డును కె.సావిత్రి(అనంతపురం) అందుకున్నారు.