Share News

ఈ విద్యా సంవత్సరంలోనే ‘పిడుగురాళ్ల’లో మెడికల్‌ అడ్మిషన్లు

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:11 AM

పిడుగురాళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అధికారులను ఆదేశించారు.

ఈ విద్యా సంవత్సరంలోనే ‘పిడుగురాళ్ల’లో మెడికల్‌ అడ్మిషన్లు

  • ఏప్రిల్‌ ఆఖరుకు సిబ్బంది నియామకాలు: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పిడుగురాళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అధికారులను ఆదేశించారు. కాలేజీలో జరుగుతున్న పనులపై సోమవారం ఆయన వర్చువల్‌గా సమీక్షించారు. ఈ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి మెడికల్‌ సీట్లకు అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా మే 15 నాటికల్లా అన్ని పనులూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వైద్య కళాశాలలో 100 ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి ఉందని, డాక్టర్లతో సహా దాదాపు 700 మంది సిబ్బందిని నియమించాల్సి ఉందన్నారు. ఇవికాకుండా అదనంగా వివిధ విభాగాల్లో మరో 520 పోస్టులకు ప్రభుత్వం నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. నియామక ప్రక్రియను ఏప్రిల్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు 45 విభాగాల్లో సహాయక సిబ్బందిని నియమించాలని కోరారు. మే 15 నాటికి కళాశాల, ఆస్పత్రి, నర్సింగ్‌ కాలేజీ, విద్యార్థుల వసతి గృహాల నిర్మాణం పూర్తి కావాలన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ మెడికల్‌ కాలేజీని సందర్శించి నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించాలని కోరారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 05:13 AM