మందుల సరఫరా వ్యవస్థలో సమగ్ర మార్పులు తెస్తాం!
ABN , Publish Date - May 01 , 2026 | 04:29 AM
ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతపై మీడియాలో ..
ఆస్పత్రుల్లో మందుల కొరత కథనాలపై సత్యకుమార్
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతపై మీడియాలో వరుస కథనాల నేపథ్యంలో మంత్రి గురువారం సచివాలయంలో అత్యవసర సమీక్ష చేపట్టారు. మందుల లభ్యత, వినియోగంపై వైద్యులు, ఫార్మసిస్టుల మధ్య సమన్వయాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. మందుల కొనుగోళ్లు, ఆసుపత్రులకు పంపిణీ, రోగులకు అందించే ప్రక్రియను ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పునఃసమీక్ష చేయిస్తామని మంత్రి చెప్పారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కింద వినియోగించే మందుల సరఫరాలో జాప్యం నివారణకు జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయాల ద్వారా కాకుండా నేరుగా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఆస్పత్రులకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.