Share News

1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి : అనగాని

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:47 AM

రాష్ట్రంలోని 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు 10-15 రోజుల్లో విముక్తి కల్పిస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి : అనగాని

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు 10-15 రోజుల్లో విముక్తి కల్పిస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం మరిన్ని రెవెన్యూ డివిజన్లు చేస్తామన్నారు. ప్రజల భూహక్కుల పరిరక్షణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రెండేళ్లలో రెవెన్యూ శాఖ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని శుక్రవారం అమరావతి సచివాలయంలో విలేకరులకు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 7.50 లక్షల భూ సమస్యలు వచ్చాయన్నారు. రీసర్వే 2.0ను పకడ్బందీగా నిర్వహించామని.. భూ యజమానులు తమ భూమి పక్కాగా వచ్చిందన్నాక పాస్‌ పుస్తకాలకు పంపామని వివరించారు. 1.33 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్‌ ఇనాం భూములను విముుక్తం చేశామని, 33 వేల ఎకరాల షరతుగల పట్టాలను విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.04 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి జిల్లా స్థాయి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఫ్రీహోల్డ్‌ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. భూముల మార్కెట్‌ విలువ పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపారు. 22ఏపై కూడా గతంలో ఇచ్చిన మెమో కన్నా ఇంకా బెటర్‌ మెమో ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 20 , 2026 | 05:48 AM