Share News

22న ‘తల్లికి వందనం’

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:22 AM

రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులను విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది.

22న ‘తల్లికి వందనం’

  • ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ

  • ఈ ఏడాది రూ.10,120 కోట్ల చెల్లింపు

  • తొలి విడతలో 64.76 లక్షల మందికి లబ్ధి

  • కొత్త అడ్మిషన్లు, వినతుల పరిశీలన తర్వాత ఆగస్టు 30న రెండో విడత

  • ఈసారి అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకూ..

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులను విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ పథకం కింద రూ.10,120.78 కోట్లు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.2 వేలు మినహాయిస్తారు. ఈ ఏడాది 17 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థులు అర్హులు. ఈ మేరకు తల్లికి వందనం నిధులు విడుదల షెడ్యూలు, మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతుల ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. తొలి విడతగా 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తర్వాత 22వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. ఆ వినతులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలిస్తారు. మరోవైపు ఆగస్టు 25 వరకు ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లకు గడువు ఉంది. ఈ క్రమంలో కొత్త అడ్మిషన్లు, వినతులను పరిశీలించి ఆగస్టు 30న రెండో విడత అర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజున తల్లికి వందనం నగదును విడుదల చేస్తారు. ఈ ఏడాది ఒకటో తరగతిలోకి 59,500, ఇంటర్‌ ఫస్టియర్‌లోకి 56,100 కొత్త అడ్మిషన్లు వస్తాయని అంచనా. ఇంటింటి సర్వేలో దొరకని 1,55,000 విద్యార్థుల రికార్డులను సరిచేసి, వారిని కూడా అర్హుల జాబితాలో చేరుస్తుంది. దీంతో ఈ ఏడాది మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులకు పథకం నగదు అందించేలా ప్రణాళిక రూపొందించింది.


వీరికి కొంత నగదు మినహాయింపు..

విద్యాహక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ఫీజులను ‘తల్లికి వందనం’ నుంచి మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కేంద్ర ఉపకార వేతనాల పథకంలో ఇచ్చిన నగదును మినహాయించుకుని, మిగిలిన మొత్తం ఇస్తారు. ఆధార్‌తో అనుసంధానమైన విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు నగదు జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి ఖాతాకు, తండ్రి కూడా లేకపోతే గార్డియన్‌ ఖాతాల్లో వేస్తారు. అనాథల నగదును జిల్లా కలెక్టర్లకు ఇస్తారు. కాగా, తొలి విడత నిధులు 22 నుంచి 24 వరకు జమ అవుతాయని విద్యామంత్రి కార్యాలయం తెలిపింది.


పథకం అర్హతలు ఇవీ..

  • నెలకు ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించకూడదు.

  • కుటుంబంలో ఒక్కరైనా రేషన్‌ కార్డులో సభ్యులుగా ఉండాలి.

  • మూడు ఎకరాలకు మించి మాగాణి లేదా మాగాణి, మెట్ట కలిపి పదెకరాలకు మించి ఉండకూడదు.

  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉంటే ఈ పథకానికి అనర్హులు. ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు.

  • నెలకు 300కు మించి విద్యుత్‌ యూనిట్లు వినియోగిస్తే అనర్హులవుతారు.

  • పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగులు మించి స్థలం ఉండకూడదు.

  • ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించే వారు అనర్హులు.

Updated Date - Jul 17 , 2026 | 04:23 AM