15 నుంచే సాగు నీరు విడుదల
ABN , Publish Date - May 07 , 2026 | 04:18 AM
ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో.. రైతులకు వేగంగా విత్తనాలు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు.
రైతులకు వేగంగా విత్తన పంపిణీ
సేంద్రియ సాగులోకి మరిన్ని పంటలు
మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
వ్యవసాయ, ఉద్యాన పంటల కొనుగోళ్లపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో.. రైతులకు వేగంగా విత్తనాలు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు. విత్తన సరఫరా కోసం రూ.200 కోట్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులతో బుధవారం సీఎం సమీక్ష జరిపారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోళ్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కానున్నది. రైతులకు నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు తీసుకోవాలి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలకు ధరలు దక్కేలా చూడాలి. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా పంట ఉత్పత్తులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. మరిన్ని పంటలను ప్రకృతి సేద్య విధానంలో సాగు చేసేలా ప్రోత్సహిస్తే.. రైతులకు ప్రయోజనం కలుగుతుంది. సేంద్రియ సాగుకు కంపోస్టు ఎరువు సరఫరా అయ్యేలా చూడాలి. ఈ ఏడాది 42.06లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నందున మొక్కజొన్న సహా, ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలి’ అని సూచించారు. అరటి, ఆయిల్‌పామ్, మిర్చి, కోకో వంటి పంటలకు ధరల సమస్య లేదని, రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు సీఎంకు చెప్పగా, మామిడిని ప్రొసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. వచ్చే పంట కాలానికి 7.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నాఫెడ్ నుంచి మినుములు, ఇతర వాణిజ్య పంటలు కొనుగోలు చేస్తున్నామని సమీక్షలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు తెలిపారు. ప్రీ మాన్సూన్ డ్రై స్పెల్ (పీఎండీఎస్) పథకం ద్వారా తక్కువ యూరియా వినియోగానికి ఇచ్చే ప్రోత్సాహకంపై కేంద్రంతో మాట్లాడాలని మంత్రి, అధికారులకు సీఎం సూచించారు.