మరో 3,900 కోట్ల అప్పు!
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:14 AM
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,900 కోట్లు అప్పుగా తెచ్చేందుకు సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం నిర్వహించే వేలంలో...
నేడు ఆర్బీఐలో సెక్యూరిటీల విక్రయం
1.07 లక్షల కోట్లకు చేరిన బడ్జెట్ రుణం
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,900 కోట్లు అప్పుగా తెచ్చేందుకు సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం నిర్వహించే వేలంలో సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని రుణంగా తీసుకోనుంది. ఆర్థిక శాఖ గత శుక్రవారమే ఆర్‌బీఐకి ఇండెంట్ పంపింది. రూ.1500 కోట్లను 17 ఏళ్లు, మరో రూ.1500 కోట్లను 20 ఏళ్లు, ఇంకో రూ.900 కోట్లను 25 ఏళ్ల కాలపరిమితితో తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలపరిమితి ఎక్కువ కావడంతో వడ్డీ రేట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.లక్షా 4 వేల కోట్ల అప్పులు తెచ్చింది. తాజాగా తెచ్చే అప్పుతో మొత్తం బడ్జెట్ రుణాలు రూ.1,07,900 కోట్లకు చేరతాయి. బడ్జెటేతర అప్పులు వీటికి అదనం. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో రూ.75,000 కోట్ల వరకు బడ్జెటేతర అప్పులు తీసుకువచ్చారు.