3.32 లక్షల కోట్లతో నేడే బడ్జెట్
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:05 AM
రాష్ట్రప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను శనివారం శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను శనివారం శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ దఫా బడ్జెట్ దాదాపు రూ.3.32 లక్షల కోట్లుగా ఉండే అవకాశముంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి దాదాపు రూ.10,000 కోట్లు పెంచనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ఉదయం 11:15 నిమిషాలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దానికి ముందు పదిన్నర గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. పయ్యావుల బడ్జెట్ పెట్టిన తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సభ ముందుంచుతారు. హోం మంత్రి అనిత శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్‌ను, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం ఉభయసభలూ వాయిదాపడతాయి. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలుపుతాయి. కాగా.. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో మన రాష్ట్రానికి ఏడాదికి రూ.10,000 కోట్లు తగ్గిపోయినట్లే. ఇతర గ్రాంట్లను కూడా కేంద్రం నిలిపివేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని భావించినా అతి స్వల్పంగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైంది. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్‌ను 10 శాతం పెంచుతూ వస్తున్నారు. ఈసారి మాత్రం కేవలం రూ.10,000 కోట్లే పెంచినట్లు తెలిసింది. అభివృద్ధి, సంక్షేమం, మహిళలు, రైతులకు ప్రాధాన్యమిస్తూ.. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. పారిశ్రామిక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని అంటున్నారు. రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంపై కూడా దృష్టి సారిస్తున్నారు.