సీబీడీసీతో పౌరసరఫరాల్లో పారదర్శకత
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:50 AM
డిజిటల్ రూపీగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానం ద్వారా పౌర సరఫరాల్లో పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని..
విశాఖ, విజయవాడల్లో ప్రయోగాత్మకంగా అమలు: నాదెండ్ల
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): డిజిటల్ రూపీగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానం ద్వారా పౌర సరఫరాల్లో పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ విధానంలో లబ్ధిదారులు తమకు ఇష్టమైన సరుకులను కొలత ప్రకారం కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సరుకులు మాత్రమే కాకుండా కార్డుదారులు నచ్చిన, అవసరమైన సరుకులను ఈ సీబీడీసీ విధానం ద్వారా తీసుకోవచ్చునని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో సీబీడీసీ పథకాన్ని ఈ ఏడాది పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ పథకం అమలు తీరును మంత్రి శుక్రవారం స్వయంగా పరిశీలించారు. కమిషనర్ కె.కన్నబాబుతో కలిసి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించిన మంత్రి... పథకం అమలుపై అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.