Share News

మందుల కొనుగోలు వ్యవస్థ ప్రక్షాళన

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:35 AM

ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

మందుల కొనుగోలు వ్యవస్థ ప్రక్షాళన

  • తమిళనాడు విధానంపై అధ్యయనం చేయాలి

  • డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ నేతృత్వంలో కమిటీ

  • ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశం

అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల కు మందుల సరఫరా, సర్జికల్‌ ఐటమ్స్‌, వైద్య పరికరాల కొనుగోలు విధానం, పంపిణీ తీరు, ఆస్పత్రుల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోగులకు మందులు అందుబాటులో ఉంచడంలో కొత్త వ్యవస్థను రూపొందించాలని అధికారులకు సూచించారు. దీనికోసం డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్థన్‌ నేతృత్వంలో ప్రజారోగ్య శాఖ సంచాలకులతో పాటు డీఎ్‌సహెచ్‌లో సీనియర్‌ అధికారి, మెడికల్‌ కార్పొరేషన్‌ డ్రగ్‌ విభాగం అధికారి, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులతో కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆస్పత్రుల్లో డిమాండ్‌కు తగ్గట్లు మందుల సరఫరా జరుగుతోందా... లేదా..? మందుల అవసరాల డేటాలో ఎంతవరకు కచ్చితత్వం ఉంటుంది..? ఎక్కడెక్కడ లోపాలున్నాయి..? వాటిని ఎలా మెరుగుపరచాలి..? అనే విషయాలపై కమిటీ దృష్టి పెట్టాలన్నారు. తమిళనాడులో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో తెలుసుకుని అక్కడి ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇతర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రెండు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలానే ఆస్పత్రుల నుంచి పరికరాలు, మిషన్లు కోసం మెడికల్‌ కార్పొరేషన్‌ ఇచ్చే ఇండెంట్ల విధానంలోనూ మార్పులు రావాలన్నారు. కాగా, రాష్ట్రంలో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ భవనాలను కేంద్ర మంత్రి జేపీ నడ్డా త్వరలోనే ప్రారంభిస్తారని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 04:35 AM