ఖనిజ రంగంలో ఏపీకి కొత్త దశ
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:14 AM
టైటానియం, రేర్ ఎర్త్ ఖనిజ రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
టైటానియం, రేర్ ఎర్త్ మినరల్స్‌తో అగ్రగామిగా రాష్ట్రం: కొల్లు
విజయవాడ సిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): టైటానియం, రేర్ ఎర్త్ ఖనిజ రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరంలో అపార బీచ్ శాండ్ ఖనిజాలు ఉన్నాయని, ఈ సహజ వనరులను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుని భారీ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. బీచ్ శాండ్ మినరల్స్‌పై గనులు, భూగర్భ వనరుల శాఖ విజయవాడలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు బుధవారం నిర్వహించిన వర్క్‌షాప్ లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘టైటానియం, రేర్ ఎర్త్ మూలకాలు.. రక్షణ, అంతరిక్ష, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాలకు అత్యంత కీలకం. భవిష్యత్ సాంకేతిక రంగాలన్నీ ఈ తరహా ఖనిజాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ఖనిజ ఆధార పరిశ్రమలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. దీనికోసం పెట్టుబడిదారులకు స్పష్టమైన పాలసీ తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రాన్ని టైటానియం, రేర్ ఎర్త్ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్ది, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని చెప్పారు. డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా టైటానియం, రేర్ ఎర్త్ అయస్కాంతాలకు డిమాండ్ భారీగా పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా లభించే బీచ్ శాండ్ ఖనిజాలకు సాంకేతిక పరిజ్ఞానంతో విలువ పెంచితే అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడే స్థాయికి చేరుకుంటామని తెలిపారు. గనుల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కార్యదర్శి యువరాజ్, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. మైన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్, పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.