‘ఉపాధి’కి ఏపీ బ్రాండ్ అంబాసిడర్
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:51 AM
నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రం ఉపయోగించుకోలేని రీతిలో ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది.
2006లో ఏపీలోనే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ప్రారంభం
నేడు ఎన్డీయే హయాంలోనూ వీబీ జీ రామ్‌జీకి ఇక్కడే శ్రీకారం
2న ముక్కావారిపల్లిలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
12 ఏళ్లలో 90 వేల కోట్లు వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రం ఉపయోగించుకోలేని రీతిలో ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. దేశంలో పేదల ఉపాధి పథకానికి ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకం స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్(వీబీజీ రామ్‌జీ) పథకాన్ని కూడా రాష్ట్రంలోనే ప్రారంభించనుండటం విశేషం. 2006లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మొదటసారి అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో అట్టహాసంగా ప్రారంభించారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రఘువంశప్రసాద్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పథకం గ్రామీణ ప్రజల జీవిత రూపురేఖలను మార్చేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారిపోయింది. పథకం ప్రారంభించి 20 ఏళ్లవుతున్నా.. ప్రతి ఏటా దేశంలోనే ప్రగతిలో మునమే ముందున్నాం. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం కూడా.. పేదల పథకం అమల్లో ముందున్న మన రాష్ట్రానికే ప్రాధాన్యమిచ్చింది. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో జూలై 2న వీబీజీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అప్పుడూ, ఇప్పుడూ ప్రభుత్వాలు వేరైనా పేదల పథకాన్ని రాష్ట్రంలోనే ప్రారంభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పథకంలో కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చిన కేంద్రం.. రాష్ట్రాలపైనా భారం మోపింది.
ఉపాధి పథకంలో సింహభాగం ఏపీకే
ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఏటా కేంద్రం విడుదల చేసే ఉపాధి నిధుల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు దక్కాయి. జాతీయస్థాయి అవార్డులు కూడా మన రాష్ట్రమే దక్కించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ పథకం ఫలాలు పొందింది. విభజన తర్వాత 12 ఏళ్లలో సుమారు 90 వేల కోట్ల ఉపాధి నిధులు మన రాష్ట్రంలో ఖర్చు చేశారు. ఈ పథకం వచ్చిన 20 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. ఈ పథకం ద్వారా శ్రామికులకు వేతనాలుగా 55 వేల కోట్లకుపైగా ఖాతాల్లో వేశారు. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు, అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, మినీ గోకులాలు తదితర వ్యక్తిగత ఆస్తుల కల్పన సైతం ఈ నిధులతో చేకూర్చారు. ఇందుకోసం రూ.31 వేల కోట్లకు పైగా మెటీరియల్ నిధులు వినియోగించారు. ఈ 12 ఏళ్లలో 270 కోట్ల పనిదినాలు కల్పించడం ద్వారా వలసలను నివారించారు. కేంద్రం నుంచి పొందిన రూ.90 వేల కోట్లకుగాను రాష్ట్ర వాటాగా 10-15వేల కోట్లు చెల్లించాం. మిగిలిన నిధులన్నీ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినవే. కాగా, 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్ట రూపంలో తెచ్చారు. ఈ చట్టం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి వంద రోజులు పని దినాలు కల్పించారు. వేతనాలు శ్రామికుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యే వెసులుబాటు కల్పించారు. నీటి సంరక్షణ, గ్రామీణరోడ్లు, భూఅభివృద్ధి, గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పన ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరుగాంచింది. ఈ పథకాలన్నింటినీ ఏపీ సంపూర్ణంగా ఉపయోగించుకున్నట్లు గణాంకాలున్నాయి. అయితే వాటన్నింటిలోనూ ఉపాధి హామీ పథకం మాత్రమే గ్రామాల రూపురేఖలను మార్చేసింది. గ్రామీణ ప్రజలు సిమెంట్ రోడ్ల మీద తిరుగుతున్నారంటే అందుకు ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ నిధులే కారణం. వ్యక్తిగత ఆస్తులతోపాటు పంచాయతీలకు ఆస్తులు సమకూర్చడంలో ఈ పథకం పాత్ర మరువలేనిది.