Share News

ఇక డబ్బులిస్తేనే కరెంటు!

ABN , Publish Date - May 17 , 2026 | 04:25 AM

విద్యుత్‌ వినియోగం, బిల్లింగ్‌లో పారదర్శకత, వినియోగదారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ప్రీపెయిడ్‌ బిల్లింగ్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ నిర్ణయించింది.

ఇక డబ్బులిస్తేనే కరెంటు!

  • ప్రీపెయిడ్‌ బిల్లింగ్‌ విధానం అమలుకు సన్నాహాలు

  • జూన్‌ 1 నుంచి ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ప్రారంభం

  • తొలుత ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు అమలు

  • క్రమంగా వాణిజ్య, గృహ వినియోగదారులకూ..

  • బిల్లింగ్‌లో పారదర్శకత, జనంలో జవాబుదారీ కోసమే!

  • మిగిలిన రెండు డిస్కంలదీ అదే బాట

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ వినియోగం, బిల్లింగ్‌లో పారదర్శకత, వినియోగదారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ప్రీపెయిడ్‌ బిల్లింగ్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ కరెంటు సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు అమర్చారు. వాటిని ప్రీపెయిడ్‌ విధానంలోకి మార్చడమే తరువాయి. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) పరిధిలో జూన్‌ 1 నుంచి ప్రీపెయిడ్‌ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. క్రమేణా వాణిజ్య, గృహ వినియోగదారులకూ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుచేసి, ప్రీపెయిడ్‌ విధానాన్ని అమలు చేసేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసుల విద్యుత్‌ వినియోగం, బిల్లింగ్‌లో పారదర్శకతను పెంచేందుకు స్మార్ట్‌ మీటర్లను ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లుగా మార్చాలని డిస్కంలు నిర్ణయించాయి. ముందుగా.. ఇప్పటికే స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్‌ వర్క్స్‌, వీధి దీపాలు తదితర సర్వీసులను ప్రీపెయిడ్‌గా మార్చనున్నారు. రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలోని కొన్ని ప్రభుత్వ సర్వీసులను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్‌ విధానంలోకి మార్చారు. ఇందులో ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలో 925 సర్వీసులు ఉన్నాయి. డిస్కంల విద్యుత్‌ కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిడి లేకుండా చేసేందుకు ప్రీపెయిడ్‌ మీటర్లను తప్పనిసరిగా అమర్చాలని కేంద్రం స్పష్టం చేసింది.


ఈ నిర్ణయానికి అనుగుణంగా డిస్కంలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో ప్రభుత్వ సర్వీసుల బకాయిల నుంచి వాటికి ఉపశమనం లభిస్తుంది. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 1.17 లక్షల ప్రభుత్వ సర్వీసుల నుంచి రూ.9,507 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. మిగిలిన డిస్కంలదీ అదే పరిస్థితి. ప్రీపెయిడ్‌ మీటరింగ్‌ ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడంతో పాటు, విద్యుత్‌ పొదుపు, బిల్లును ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మీటర్ల ద్వారా వినియోగదారుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదించిన యూనిట్‌ ధరల ప్రకారం ప్రీపెయిడ్‌ విధానం ద్వారా రోజువారీ విద్యుత్‌ వినియోగ చార్జీలను బ్యాలెన్స్‌ నుంచి మినహాయిస్తారు. ఆ బ్యాలెన్స్‌ నిర్దిష్ట కనిష్ఠ పరిమితి కంటే దిగువకు చేరిన వెంటనే సంబంధిత అధికారులకు ఈ-మెయిల్‌/ఎ్‌సఎంఎస్‌ రూపంలో సమాచారాన్ని తెలియజేస్తారు. బ్యాలెన్స్‌ సున్నాకు చేరినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది.


మిగతా డిస్కంలు కూడా..

జూన్‌ 1 నుంచి ప్రీ-పెయిడ్‌ మీటర్లను అమల్లోకి తెచ్చేందుకు ఎస్పీడీసీఎల్‌ ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన డిస్కంలు కూడా ఇందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు/ మున్సిపాలిటీలు, వాటర్‌వర్క్స్‌, వీధి దీపాలు తదితర సర్వీసులకు సంబంధించి ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 1.17 లక్షల సర్వీసులు, సీపీడీసీఎల్‌ పరిధిలో 71,174, ఈపీడీసీఎల్‌ పరిధిలో 2.45 లక్షల సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటినీ కొన్ని గ్రూపులుగా విభజించి.. ఈ-వ్యాలెట్‌ ద్వారా రీచార్జ్‌ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆయా విభాగాలు బిల్లింగ్‌ సైకిల్‌కు సంబంధించిన విద్యుత్‌ చార్జీలు, స్థిర చార్జీల అడ్వాన్సు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతినెలా 5వ తేదీలోగా ఆయా సంస్థలు చెల్లించాల్సిన అడ్వాన్స్‌ మొత్తం వివరాలను డిస్కంలు ఆర్థిక శాఖకు తెలియజేస్తాయి.

Updated Date - May 17 , 2026 | 04:28 AM