ఎక్కడ కరెంట్ పోయిందో ఏఐ చెప్పేస్తుంది
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:11 AM
ప్రకృతి విపత్తులతోనో, మరేదైనా కారణంతోనో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే, సంబంధిత ప్రాంత విద్యుత్ కార్యాలయానికో.. లైన్‌మెన్‌కో ఇకపై ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉండదు.
విద్యుత్ లైన్లలో అంతరాయాలకు టెక్నాలజీతో చెక్!
ఆఫీసులోని కంప్యూటర్‌తోనే స్పాట్ గుర్తించే చాన్స్
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ‘డిజిటల్ ట్విన్ గ్రిడ్’
స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ ల్యాబ్ ‘ప్రవాహ’ సహకారంతో ఏర్పాటు
త్వరలో మూడు డిస్కంల పరిధిలో అమలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రకృతి విపత్తులతోనో, మరేదైనా కారణంతోనో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే, సంబంధిత ప్రాంత విద్యుత్ కార్యాలయానికో.. లైన్‌మెన్‌కో ఇకపై ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉండదు. విద్యుత్ సిబ్బంది వచ్చి సరఫరాను పునరుద్ధరించే వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా రాదు. విద్యుత్ శాఖ కార్యాలయంలో కూర్చునే కరెంట్ ఎక్కడ పోయిందో కంప్యూటర్ స్ర్కీన్‌పైనే సులువుగా తెలుసుకునే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. వినియోగదారుల ఫిర్యాదులతో సంబంధం లేకుండా అంతరాయాలను గుర్తించే ఆ సూపర్ టెక్నాలజీ ‘డిజిటల్ ట్విన్ గ్రిడ్’ను రాష్ట్ర విద్యుత్ శాఖ అభివృద్ధి చేస్తోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పవర్‌సెక్టార్ రిఫార్మ్స్ 3.0లో భాగంగా సాంకేతికత, కృత్రిమ మేధ(ఏఐ), అంతర్జాతీయ భాగస్వామ్యాలను అనుసంధానిస్తూ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అధునాతన టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వ విద్యాలయానికి చెందిన ఏఐ ల్యాబ్ ‘ప్రవాహ’ భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా డిజిటల్ ట్విన్ గ్రిడ్ టూల్‌ను ఏపీ డిస్కంలు రూపొందిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన పవర్‌థాన్‌లో ‘ప్రవాహ’ టూల్ ఎంపిక అయింది. ఈ ప్రాజెక్టు కింది ఏపీ డిస్కంల పరిధిలోని విద్యుత్ పంపిణీ గ్రిడ్‌ను వినియోగదారుడి స్థాయి వరకు పూర్తిగా డిజిటలైజ్ చేస్తారు. ఒక డిజిటల్ ట్విన్ లాగా టెక్నాలజీని అభివృద్ధి చేయడం వల్ల గ్రిడ్ పర్యవేక్షణే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్వయం చాలకంగా లోపాలను గుర్తించి సరిదిద్దే వెసులుబాటు కలుగుతుంది. త్వరలో మూడు డిస్కంల పరిధిలో అమలుకు కసరత్తు జరుగుతోంది.
ఏమిటీ డిజిటల్ ట్విన్ గ్రిడ్?
క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన విద్యుత్త్ గ్రిడ్ (సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, వినియోగదారుల కనెక్షన్లు) నెట్‌వర్క్‌ను అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ రూపంలో లేదా కంప్యూటర్ స్ర్కీన్‌పై ఒక వర్చువల్ ప్రతిరూపంలాగా సృష్టించే విధానాన్నే డిజిటల్ ట్విన్ గ్రిడ్ అంటారు. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేసే పని లేకుండా మొత్తం విద్యుత్త్ సరఫరా వ్యవస్థను కంప్యూటర్ స్ర్కీన్‌పైకి తెచ్చి ఏఐ సాయంతో నాణ్యమైన, అంతరాయం లేనివిద్యుత్త్‌ను అందించేందుకు ఉపయోగపడే ఓ సూపర్ టెక్నాలజీగా ఈ డిజిటల్ ట్విన్ గ్రిడ్ ఉపయోగపడుతుంది. దీనితో ఉపయోగాలేమిటంటే..
రియల్‌టైం డేటా పర్యవేక్షణ: దీని ద్వారా విద్యుత్ సరఫరా నాణ్యత, అంతరాయాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ లోడింగ్ వంటి అంశాలను అధికారులు క్షణక్షణానికి పర్యవేక్షించవచ్చు. నిజమైన గ్రిడ్‌కు అమర్చిన సెన్సార్లు, స్మార్ట్ మీటర్ల ద్వారా వచ్చే డేటాను ఈ డిజిటల్ గ్రిడ్ నిరంతరం సేకరిస్తుంది. దీనివల్ల ఏ వినియోగదారుడి ఇంటి వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, లోవోల్టేజీ సమస్య తలెత్తినా అధికారులు తమ కార్యాలయంలో స్ర్కీన్లపై రియల్ టైంలో చూడవచ్చు. నేరుగా వెళ్లి సమస్య పరిష్కరించవచ్చు.
ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ అంచనా: గ్రామాల్లో లేదా వీధుల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై (డీటీఆర్) ఎంత లోడ్ పడుతుంది, ఏ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌తో కాలిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా డిజిటల్ ట్విన్ గ్రిడ్‌లోని ఏఐ టూల్ ముందుగానే అనలిటిక్స్ ద్వారా గుర్తిస్తుంది.
నెట్‌వర్క్ ఆధునికీకరణ: భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ ఎలా ఉండబోతోంది. గ్రిడ్ నెట్‌వర్క్‌ను ఎక్కడెక్కడ మెరుగుపర్చాలి అనే అంశాలపై కచ్చితమైన విశ్లేషణలు చేయడానికి ఈ డిజిటల్ ప్రతిరూపం ఉపయోగపడుతుంది.