ఈ-బస్సుల కోసం డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు
ABN , Publish Date - May 24 , 2026 | 04:30 AM
‘పీఎం ఈ-బస్ సేవా’ పథకం కింద విద్యుత్తు మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఏపీఎస్ఆర్టీసీ వేగంగా ముందుకు సాగుతోందని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు.
12 నగరాల్లో అందుబాటులోకి 1,050 ఈ-బస్సులు
అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): ‘పీఎం ఈ-బస్ సేవా’ పథకం కింద విద్యుత్తు మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఏపీఎస్ఆర్టీసీ వేగంగా ముందుకు సాగుతోందని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ-చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు సౌకర్యాలకు మౌలిక వసతుల కల్పన పనుల పురోగతిపై శనివారం ఆయన విద్యుత్‌సౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. విజయానంద్ మాట్లాడుతూ.. పీఎం ఈ-బస్ సేవా పథకం టెండర్-2 కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ రాష్ట్రంలోని 11 నగరాలు, 12 డిపోలను కలుపుకొని మొత్తం 750 విద్యుత్ బస్సులు మంజూరు చేసిందన్నారు. అదనంగా సీఈఎ్‌సఎల్ టెండర్-3 కింద ప్రత్యేక కేటాయింపుగా తిరుపతికి మరో 300 విద్యుత్ బస్సులు మంజూరైనట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అమరావతి, తిరుపతి, అనంతపురం వంటి ప్రధాన పట్టణాల్లో ఈ బస్సులను ప్రవేశపెడతామన్నారు. విద్యుత్ బస్సుల నిరంతరాయ కార్యకలాపాలకు అవసరమైన బిహైండ్ ది మీటర్ (బీటీఎం) చార్జింగ్ మౌలిక సదుపాయాలను అన్ని డిపోల్లో సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పనుల కోసం మొత్తం రూ.89.99 కోట్ల అంచనాకు గాను రూ.79.98 కోట్లను కేంద్ర శాంక్షనింగ్ అండ్ స్టీరింగ్ కమిటీ (సీఎస్ఎస్‌సీ) మంజూరు చేసిందని చెప్పారు.