రాష్ట్రంలో వెయ్యి మినీ మార్టులు
ABN , Publish Date - May 20 , 2026 | 04:38 AM
పౌరసరఫరాల శాఖ ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మిలటరీ క్యాంటీన్లలో అరకు కాఫీ ఉత్పత్తులు
న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీటి ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించేందుకు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీసీఎఫ్) ముందుకొచ్చిందని చెప్పారు. కందిపప్పు, మినపప్పు, తృణధాన్యాలు తదితరాలను మార్కెట్ ధర కంటే తక్కువకు మినీ మార్టుల్లో సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పెట్రోలియం, సహజ వాయువు శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్, సంయుక్త కార్యదర్శి సుజాత శర్మతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం, ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని మిలటరీ క్యాంటీన్లలో అరకు కాఫీ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా రేషన్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మరో నెల రోజుల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విశాఖపట్నం, విజయవాడల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ధాన్యం సేకరణపై వైసీపీ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు చేసిన దగాను ఆ పార్టీ నేతలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 2023-24లో వైసీపీ ప్రభుత్వం రబీలో కేవలం 12.65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.2,763 కోట్లు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఈసారి రబీలో ఇప్పటికే 22.71 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రూ.5,400 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని మనోహర్ పేర్కొన్నారు.