Share News

కొత్తగా 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:02 AM

పర్యావరణ హితమైన పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ)ను రాష్ట్రంలో ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

కొత్తగా 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు

  • పీఎన్‌జీని ప్రోత్సహించాలని క్యాబినెట్‌ నిర్ణయం

  • మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ హితమైన పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ)ను రాష్ట్రంలో ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లను పీఎన్‌జీ కనెక్షన్లకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్నవారిని పీఎన్‌జీ వైపు మళ్లించేందుకు ప్రోత్సహించడానికి పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మార్చే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తెచ్చిందని చెప్పారు. పీఎన్‌జీకి మారితే ఆర్థికంగా 30శాతం ఆదా అవుతుందని శాస్త్రీయంగా తేలిందన్నారు. వచ్చే నెలలో లక్ష పీఎన్‌జీ గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు పీఎన్‌జీ వినియోగిస్తే కేంద్రం ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది. ప్రముఖ దేవాలయాలతో పాటు పీఎన్‌జీ కనెక్షన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పీఎన్‌జీ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, కమర్షియల్‌ యూనిట్లు, పారిశ్రామిక యూనిట్లకు 24 గంటల్లోనే మంజూరు చేస్తాం. అవసరమైతే ఆటోమేటిక్‌ అనుమతి వ్యవస్థను అమలు చేస్తాం. గత ప్రభుత్వం పీఎన్‌జీపై 5 శాతం ఉన్న జీఎస్టీని 25 శాతానికి పెంచడం వల్లే వినియోగదారులు ఆసక్తి చూపలేదు. పట్టణాల్లో దీపం పథకంలోని గ్యాస్‌ కనెక్షన్లను పీఎన్‌జీ గ్యాస్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం లబ్ధిదారులు పీఎన్‌జీకి మారినా దీపం పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. దీపం పథకం కింద 4నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్‌ అందిస్తుండగా, పీఎన్‌జీకి మారిన వారికి నిబంధనల మేరకు 2నెలలకు ఒకసారి సబ్సిడీ అందే విధంగా మార్పులు చేస్తాం. రాష్ట్రంలో 94 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 6 గ్యాస్‌ సరఫరా సంస్థలు అదనపు పైప్‌లైన్లు వేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. వాణిజ్య గ్యాస్‌ వాడే వారికి కొంత ఇబ్బందులున్నాయి. అంగన్వాడీలకు ఇప్పటికే 11వేల ఇండక్షన్‌ స్టౌలు ఇచ్చాం. మిగిలిన అంగన్వాడీ కేంద్రాలకు వాటిని ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి తెలిపారు. ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు.

Updated Date - Mar 27 , 2026 | 05:02 AM