Share News

అరుదైన వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక విధానం!

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:02 AM

అరుదైన వ్యాధులతో బాధపడేవారి ప్రత్యేక పాలసీని రూపొందించబోతున్నామని మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు.

అరుదైన వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక విధానం!

  • 24న వైద్యులతో ప్రత్యేక సదస్సు: సత్యకుమార్‌

అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): అరుదైన వ్యాధులతో బాధపడేవారి ప్రత్యేక పాలసీని రూపొందించబోతున్నామని మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. వారికి ఉచిత వైద్యసేవలతోపాటు సదరు కుటుంబాలకు అండగా నిలవనున్నట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కోర్‌ కమిటీ ఈ నెల 24వ తేదీన ప్రత్యేక సదస్సు నిర్వహిస్తుందన్నారు. ఇటీవల తాను ఢిల్లీ పర్యటనలో పీఎం నరేంద్ర మోదీ, ఐసీఎంఆర్‌ అధికారులతో విడివిడిగా చర్చించినట్లు తెలిపారు. జాతీయ అరుదైన వ్యాధుల విధానం-2021ను అనుసరించి రాష్ట్రస్థాయి రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ, రిఫరల్‌ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలను పాలసీలో పొందుపరుస్తామన్నారు. ప్రధాన బోధనాసుపత్రులను అరుదైన వ్యాధుల నిర్ధారణ, చికిత్స కేంద్రాలుగా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పాలసీ సిద్ధం చేసి ఈ ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నామని తెలిపారు. వైద్య పరికరాల కోసం ప్రారంభ దశలో కేంద్రం రూ.5 కోట్లు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ ఆసుపత్రుల్లో పేర్లు నమోదు చేసుకున్న వారిలో కేటగిరి-1, కేటగిరి-2లో పేర్కొన్న వ్యాధులతో బాధపడేవారికి చికిత్స కోసం కేంద్రం వారి జీవిత కాలంలో రూ.50 లక్షలు అందిస్తుందని తెలిపారు. కేటగిరి-3లో వారికి వన్‌టైమ్‌ ఎయిడ్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం సాయం చేస్తుందని తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 05:02 AM