పట్టణాల్లో డ్రెయిన్ల మ్యాపింగ్
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:46 AM
ఇప్పటి వరకు చేస్తున్న డ్రెయిన్ల శుభ్రతకు భిన్నంగా ప్లానింగ్‌తో కూడిన, సాంకేతిక ఆధారిత పట్టణ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణకు మున్సిపల్‌శాఖ శ్రీకారం చుట్టింది.
నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం శుభ్రం చేసే వ్యవస్థ
పట్టణ డ్రెయిన్ల నిర్వహణకు మున్సిపల్‌శాఖ ఎస్‌ఓపీ
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు చేస్తున్న డ్రెయిన్ల శుభ్రతకు భిన్నంగా ప్లానింగ్‌తో కూడిన, సాంకేతిక ఆధారిత పట్టణ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణకు మున్సిపల్‌శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నాలాలు, స్మార్ట్ వాటర్ డ్రెయిన్లు, ప్రధాన, మధ్యస్థ, చిన్న డ్రెయిన్ల శాస్త్రీయ పూడికతీత, సురక్షిత, శుభ్రత కోసం సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎ్‌సఓపీ)ను జారీ చేసింది. ఈ ఎస్‌ఓపీ ద్వారా దీర్ఘకాలిక నీటిముంపు సమస్యలు, వరద ప్రమాదాలు తగ్గించడం, పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు కార్మికుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ప్రతి డ్రెయిన్‌ను మ్యాపింగ్ చేసి నిరిష్ట షెడ్యూల్ ప్రకారం శుభ్రం చేస్తారు. డిజిటల్‌గా పర్యవేక్షిస్తారు. లోపాలు ఉన్న చోట శాశ్వత నిర్మాణ సవరణలు చేపడతారు. వీటన్నిటికీ మున్సిపల్ కమిషనర్లు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ఎస్‌ఓపీలో పేర్కొన్నారు. యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత తప్పనిసరి. ఎస్‌ఓపీని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విధానంతో పట్టణ వరదల నివారణ, దోమలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల తగ్గింపు, పట్టణ పరిశుభ్రత, పారిశుధ్య కార్మికుల భద్రత, గౌరవం పెంపుదల సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.