‘అమరావతి’ కోసంఅత్యవసర భేటీ!
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:22 AM
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిని రాజధానిగా గుర్తించాలని..
ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం
ఆమోదించాక కేంద్రానికి నివేదన
పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే విభజన చట్ట సవరణ బిల్లు పెట్టే చాన్సు
నిజానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం చాలు
అయితే భవిష్యత్‌లో సమస్యలు రాకుండా అసెంబ్లీ తీర్మానం మేలన్న క్యాబినెట్ కార్యదర్శి
పీఎంవో నుంచి ఆగమేఘాలపై సూచనలు
ఫలితంగానే 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదన
గవర్నర్ ఆమోదం.. వెంటనే నోటిఫికేషన్ జారీ
1న పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిని రాజధానిగా గుర్తించాలని.. ఇందుకోసం రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం (28న) ప్రత్యేకంగా సమావేశం కానుంది. వాస్తవానికి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్ర విభజన చట్టంలో చేర్చాలని రాష్ట్రప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. కేంద్రం లేవనెత్తిన సందేహాలన్నిటినీ నివృత్తిచేస్తూ రాష్ట్రప్రభుత్వం అవసరమైన సమాచారాన్ని కూడా అంద జేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావే శాల్లోనే రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి వీలుగా మోదీ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రత్యేక తీర్మానం కోరింది. సాధారణ పరిస్థితుల్లో అయితే రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం సరిపోతుంది. కానీ భవిష్యత్‌లో సమస్యలు తలెత్తకుండా అంతా పకడ్బందీగా ఉండాలంటే అసెంబ్లీ తీర్మానం ఉంటే మంచిదని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సూచించడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) నుంచి రాష్ట్రానికి సూచనలు అందడం.. 28న అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిపోయాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రొరోగ్ అయినందున మళ్లీ భేటీ కావాలంటే గవర్నర్ సమన్లు జారీ చేయాలి. అత్యవసర సమావేశానికి కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. దీంతో రాష్ట్రప్రభుత్వం బుధవారం ఆయనకు ప్రతిపాదన పంపడంతో ఆయన వెంటనే శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి నోటిఫికేషన్ కూడా జారీచేశారు. 28న ఉదయం 11 గంటలకు సభ కొలువు తీరనుంది. అయితే శాసనమండలి సమావేశం ఉండదు. తీర్మానం ఆమోదానికి అసెంబ్లీ అయితే సరిపోతుంది. ఏదైనా బిల్లును ఆమోదించాల్సి ఉంటేనే మండలిని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది.
భవిష్యత్‌లో రాజధానిని మార్చకుండా..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. సదరు చట్టంలోని సెక్షన్ 5లో 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్దేశిత పదేళ్ల కాలం పూర్తయింది. ఈలోపే ఏపీ ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటుచేసుకుంది. అయితే దానికి చట్టబద్ధత లేదని కొన్ని అపోహలున్నాయి. కానీ అది వాస్తవం కాదు. కొత్త రాజధాని ఏర్పాటు గురించి 2015 ఏప్రిల్ 23న జీవో 97 జారీ చేశారు. ఆ వెంటనే గెజిట్‌లోనూ ప్రచురించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని తెలుగువారి ఖ్యాతిని చాటేదిగా అమరావతి అని నామకరణం చేస్తున్నట్లు అందులో స్పష్టంగా ఉంది. ఇందులో శషబిషలకు తావులేదు. కానీ జగన్మోహన్‌రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి.. మూడు రాజధానుల పేరిట హైడ్రామా నడిపారు. అమరావతిని కేవలం శాసనసభకు మాత్రమే పరిమితం చేస్తూ విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెట్టడానికి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బిల్లు కూడా పెట్టారు. దానిని అసెంబ్లీ ఆమోదించినా శాసనమండలిలో బ్రేక్‌పడింది. అయితే అమరావతే రాష్ట్ర రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రావడానికి ముందే జగన్ మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక వచ్చిన కూటమి ప్రభుత్వం.. రాజధాని విషయంలో మరింత అప్రమత్తమైంది. భవిష్యత్‌లో జగన్, ఇంకెవరైనా అధికారంలోకి వచ్చినా.. రాజధానిని మార్చడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5లో ‘పదేళ్ల తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉండాలి’ అన్న చోట ‘అమరావతి కొత్త రాజధానిగా ఉండాలి’ అని పొందుపరచాలని.. ఈ దిశగా సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సీఎం చంద్రబాబు, కూటమి నేతలు కేంద్రాన్ని ఒప్పించారు.
2014లోనే విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం సభలో తీర్మానం చేసి పంపించింది. అప్పటికి అమరావతి పేరును ఖరారు చేయలేదు. గత ఏడాది మేలో రాష్ట్ర మంత్రిమండలి అమరావతిని రాజధానిగా తీర్మానించి కేంద్రానికి పంపించింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, అమిత్‌షాను కలిసినప్పుడల్లా దీనిని గుర్తుచేస్తున్నారు. అయితే క్యాబినెట్ కంటే.. శాసనసభ తీర్మానానికే ఎక్కువ విలువ ఉంటుందని.. భవిష్యత్‌లో గందరగోళాలకు తావుండదని పీఎంవో తాజాగా సూచించడంతో.. శనివారం అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరచి.. తీర్మానం చేయాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది. గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉంది. కుదిరితే అప్పుడే తీర్మానం ఆమోదించి శనివారం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. లేదంటే శనివారం ఉదయమే మంత్రిమండలి సమావేశమై తీర్మానం చేస్తుంది. తర్వాత సభలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపుతుంది.
పార్లమెంటులో 1న అమరావతి బిల్లు?
అమరావతిని రాజధానిగా గుర్తించే చట్టసవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనే బిల్లును ఆమోదించాలని తొలుత భావించారు. ఆఖరు నిమిషంలో అసెంబ్లీ తీర్మానం లేకుండా బిల్లును ఆమోదించలేమని కేంద్ర న్యాయశాఖ వర్గాలు చెప్పడంతో పక్కనపెట్టినట్లు తెలిసింది. 28న ప్రత్యేక అసెంబ్లీ తీర్మానం ఆమోదించి పంపిన తర్వాత.. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ భేటీలో బిల్లును ఆమోదించి అదే రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2వ తేదీన ముగియనున్న విషయం తెలిసిందే.