‘స్మార్ట్’గా భోజనం!
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:20 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతను మరింత పెంచేలా కూటమి ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్’ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కడపలో ఒక మోడల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయగా..
తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్‌లు
6,107 పాఠశాలలకు అక్కడి నుంచే భోజనం
ఒక్కో కిచెన్‌ను 55 లక్షలతో నిర్మించేలా ప్రణాళిక
శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 20 స్మార్ట్ కిచెన్‌లు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన సమగ్రశిక్ష విభాగం
దశలవారీగా అన్ని స్కూళ్లు, కాలేజీలకూ ప్రాజెక్టు విస్తరణ
భోజనం నాణ్యతను పెంచేలా ప్రభుత్వం చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతను మరింత పెంచేలా కూటమి ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్’ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కడపలో ఒక మోడల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయగా.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణానికి సమగ్రశిక్ష విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సగటున 40 పాఠశాలలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే ఆ స్కూళ్లకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. తొలి దశలో భాగంగా మొత్తంగా 155 కిచెన్‌లతో 6,107 పాఠశాలల్లో 5,31,681 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించనున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును దశల వారీగా రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కవర్ అయ్యేలా విస్తరింపజేయనున్నారు. స్మార్ట్ కిచెన్‌ను 1,200 చదరపు అడుగుల్లో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. అందులో ఫ్రిడ్జ్, కూరగాయల బాస్కెట్లు, 30 కిలోల బియ్యం ఉడికే పాత్రలు, స్టీమ్ లైన్, వెయ్యి లీటర్ల ఆర్‌వో ప్లాంట్, రూఫ్‌టాప్ సోలార్, సీసీ కెమెరాలు, ఇతర ఉపకరణాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో కిచెన్ నిర్మాణానికి రూ.55 లక్షల వ్యయం అవుతుందని సమగ్రశిక్ష అంచనా వేసింది. దీని ప్రకారం 155 స్మార్ట్ కిచెన్‌లకు రూ.84.99 కోట్ల నిధులు అవసరమవుతాయి. అయితే మధ్యాహ్న భోజనం కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రాష్ర్టానికి 1,473 కిచెన్ కమ్ స్టోర్లు మంజూరు చేసింది.
ఆ నిధులను స్మార్ట్ కిచెన్‌ల ప్రాజెక్టుకు వినియోగిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. పైగా కిచెన్ కమ్ స్టోర్ ఒక పాఠశాలకు మాత్రమే పరిమితం. అందువల్ల 1,473 స్కూళ్లకు ఇచ్చిన నిధులతోనే 6,107 పాఠశాలలు కవర్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ వివరించింది. కిచెన్ నిర్మాణానికి రూ.26 లక్షలు, సోలార్ సిస్టమ్‌కు రూ.2.5 లక్షలు, ఆర్వో ప్లాంట్‌కు రూ.2 లక్షలు, భోజనం పాఠశాలలకు తీసుకెళ్లే వాహనాలకు రూ.5.25 లక్షలు, కిచెన్ ఉపకరణాలకు రూ.20 లక్షలు అవుతుందని అంచనాలు రూపొందించింది.
స్మార్ట్ కిచెన్‌తో ఉపయోగాలు
భోజనం నాణ్యత, శుభ్రత, భద్రత పెరుగుతుంది.
అన్ని పాఠశాలలకు ఒకే విధమైన భోజనం
వంట సమయం, శ్రమ తగ్గుతుంది.
ఎక్కువ ఇంధనం ఖర్చు అవ్వదు. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.
మధ్యాహ్న భోజనంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది.
ఒక్కో స్మార్ట్ కిచెన్ కనీసం 1,500 నుంచి 5 వేల మంది విద్యార్థులకు భోజనం తయారు చేస్తుంది.
5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తుంది. గరిష్ఠంగా 30 పాఠశాలలకు భోజనం అందించే సామర్థ్యంతో స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేస్తారు.
దశల వారీగా అన్ని పాఠశాలలకు..
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు 45 వేలు ఉన్నాయి. వాటిలో సుమారు 32 లక్షల మంది విద్యార్థులున్నారు. ఎన్ని నిధులు వెచ్చించినా మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. పాత విధానంలో వంట విధానం వల్ల కొన్నిచోట్ల భోజనం సమయానికి అందడం లేదు. సమర్థవంతమైన ఇంధన వినియోగ విధానం లేకపోవడంతో ఖర్చు పెరుగుతోంది. అలాగే సరైన అంచనా లేకపోవడం వల్ల భోజనం వృథా కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్మార్ట్ కిచెన్‌ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 155 కిచెన్‌లు ఏర్పాటు చేసి, ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని 45 వేల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కవర్ అయ్యేలా ప్రాజెక్టును విస్తరించనున్నారు.
జిల్లాల వారీగా ఇలా..
శ్రీకాకుళం జిల్లాలో 20, పార్వతీపురం మన్యంలో 3, విజయనగరంలో 3, విశాఖపట్నంలో ఒకటి, అల్లూరి సీతారామరాజులో 4, అనకాపల్లిలో ఒకటి, కాకినాడలో 4, తూర్పుగోదావరిలో ఒకటి, కోనసీమలో 6, ఏలూరులో 3, పశ్చిమగోదావరిలో ఒకటి, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 3, గుంటూరులో 3, పల్నాడులో 4, బాపట్లలో 6, ప్రకాశంలో 10, నెల్లూరులో 16, తిరుపతిలో 8, చిత్తూరులో 3, అన్నమయ్యలో 7, కడపలో 5, శ్రీసత్యసాయిలో 10, అనంతపురంలో 14, కర్నూలులో 6, నంద్యాలలో 9 స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటుకు సమగ్రశిక్ష ప్రతిపాదనలు సిద్ధం చేసింది.