సముద్ర నాచు సాగుతో మహిళల ఆదాయం పెంచాలి
ABN , Publish Date - May 07 , 2026 | 04:17 AM
రాష్ట్రంలోని సముద్ర నాచు (సీవీడ్) ఉత్పత్తులు, విలువ జోడింపుతో మహిళల ఆదాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆర్థిక నమూనా సిద్ధం చేయండి
సెర్ప్ అధికారులకు సీఎం ఆదేశం
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సముద్ర నాచు (సీవీడ్) ఉత్పత్తులు, విలువ జోడింపుతో మహిళల ఆదాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ఓ ఆర్థిక నమూనాను సిద్ధం చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో సముద్ర నాచు సాగుతో డ్వాక్రా మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయాల కల్పనపై బుధవారం సచివాలయంలో ఆయన సెర్ప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మన తీర ప్రాంతాల్లో సముద్ర నాచు సాగుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తదితర సంస్థల ఉన్నతాధికారులతో సీఎం వర్చువల్‌గా మాట్లాడారు. అమృతా విశ్వవిద్యాపీఠంతో కలిసి మహిళలు సముద్ర నాచు సాగు చేయడానికి సంబంధించి ఓ నివేదిక ఇవ్వాలని సూచించారు. సముద్ర నాచు సాగు ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేలా వాణిజ్య ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కూడా సంప్రదించాలన్నారు. సంపద సృష్టికి ఇది కీలకమైన ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. ఫార్మా, న్యూట్రాసూటికల్ ఉత్పత్తుల్లో ప్రధానమైన ముడిసరుకుగా ఈ సీవీడ్ అంతర్జాతీయ మార్కెట్‌ను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు.