మే 1 నుంచి జనగణన
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:34 AM
జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి రాష్ట్రంలో హౌస్‌లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ర్టేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు.
స్వీయ నమోదుకు పబ్లిక్ పోర్టల్
తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు
సీఎంకు వివరించిన సెన్సెస్ డైరెక్టర్ నివాస్
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి రాష్ట్రంలో హౌస్‌లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ర్టేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. మంగళవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంను కలిసి జనాభా లెక్కల ప్రక్రియను రెండు దశల్లో చేపడుతున్నట్టు వివరించారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన చేయనున్నట్లు తెలిపారు. మే 30 వరకు జరిగే ఈ ప్రక్రియలో ఇళ్లలోని సదుపాయాలు, ఆస్తుల వివరాలు నమోదు చేయనున్నామని, స్వీయ గణనకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. రెండో దశ 2027 ఫిబ్రవరి నుంచి చేపట్టి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన వివరాలు నమోదు చేయనున్నట్లు వివరించారు. తొలిసారి పూర్తి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు నమోదు చేయనున్నట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్లు, వెబ్ పోర్టళ్ల ద్వారా సమాచార సేకరణ జరుగుతుందని, ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో చేస్తామని చెప్పారు. ప్రజలే తమ వివరాలను స్వీయ గణన ద్వారా నమోదు చేసేందుకు పబ్లిక్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.