క్రియేటర్ ఎకానమీ సెంటర్‌గా ఏపీ
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:29 AM
ఆంధ్రప్రదేశ్‌ను క్రియేటర్ ఎకానమీ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏఐ సమ్మిట్‌లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను క్రియేటర్ ఎకానమీ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్ నైపుణ్యాలు ఉన్న యువశక్తి ఏపీకి అతిపెద్ద వనరుగా అభివర్ణించారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో యువతను నిపుణులుగా తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని వెల్లడించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో భాగంగా భారత్ మండపంలో ఉన్న ఏపీ పెవిలియన్‌లో దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏపీకి సహాయ, సహకారాలు అందించే అంశాలపై వారితో చర్చించారు. ఆడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్‌కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకేౖర్, లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సీటీవో శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో సీఎం భేటీలు నిర్వహించారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ అనుకూలం
రాష్ట్రంలో సౌర విద్యుత్తు సహా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై సౌదీ ఆరామ్‌కో ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు. . గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతమని వివరించారు. ప్రముఖ టెక్ కంపెనీ ఆడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ సందర్భంగా క్రియేటర్ ఎకానమీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి సహకారం అందించాలని కోరారు. ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం సహకారం అందించాలని ఎన్‌విడియా వైస్ ప్రెసిడెంట్ కాలిస్టారెడ్మెండ్‌కు విజ్ఞప్తి చేశారు.
మన క్వాంటం వ్యాలీ గురించి అంతా మాట్లాడతారు: సీఎం
సమీప భవిష్యత్తులో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగ ంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్వర్యంలో నిర్వహించిన ’కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం’ అంశంపై రౌండ్‌టేబుల్ సదస్సులో ఆయన ప్రసగించారు. గూగుల్ లాంటి సంస్థల రాకతో విశాఖపట్నం డేటా హబ్‌గా మారుతోందన్నారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టమ్‌ను రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఏఐ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందని, పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లడంపై ఏపీ దృష్టి సారిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.