ఏడాదిలో 4 సార్లు ఓటు నమోదు
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:34 AM
కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకునేవారికి శుభవార్త. ఇకపై సంవత్సరంలో నాలుగుసార్లు ఓటు హక్కు నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.
జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబరులో అవకాశం.. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకునేవారికి శుభవార్త. ఇకపై సంవత్సరంలో నాలుగుసార్లు ఓటు హక్కు నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుత విధానంలో కొత్తగా ఓటు హక్కు నమోదు ఏడాదిలో ఒక్క జనవరి 1న మాత్రమే ఉంది. దీనివల్ల జనవరి 1 తర్వాత 18 ఏళ్లు నిండే యువత ఓటు నమోదుకు దాదాపు ఏడాది కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇంత జాప్యం లేకుండా ఓటు హక్కు నమోదుకు కేంద్రం ఏడాదిలో నాలుగు సార్లు.. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబరు నెలల్లో 1న ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పిస్తూ చట్టాల్లో సవరణలు చేసింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లోనూ ఈ విధానం అమలవుతోంది. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలోనూ సవరణలు చేయడం వల్ల గ్రామాల్లోనూ నాలుగుసార్లు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బదులుగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది.