Share News

పాఠ్యపుస్తకాల్లో రూ.13.5 కోట్లు ఆదా!

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:47 AM

పాఠశాల విద్యాశాఖ చర్యలతో పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.13.5 కోట్లు మిగిలాయి. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల ముద్రణకు విద్యాశాఖ ఇటీవల టెండర్లు పిలిచింది.

పాఠ్యపుస్తకాల్లో రూ.13.5 కోట్లు ఆదా!

  • పేజీ ఆరు పైసలకే ముద్రించేలా టెండరు ఖరారు

  • ఎల్‌1తో పాటు స్థానిక ప్రింటర్లకూ ముద్రణ వర్క్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పాఠశాల విద్యాశాఖ చర్యలతో పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.13.5 కోట్లు మిగిలాయి. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల ముద్రణకు విద్యాశాఖ ఇటీవల టెండర్లు పిలిచింది. ఎనిమిది శ్లాబుల్లో వేర్వేరు పుస్తకాలకు టెండర్లు పిలిచారు. 128 కంటే ఎక్కువ పేజీలున్న పుస్తకాలే 95 శాతం వరకు ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన షఫ్రాన్‌ స్పెషాలిటీ పేపర్స్‌ కంపెనీ ఒక్కో పేజీ 6 పైసలకు ముద్రిస్తామని కోట్‌ చేసింది. రాష్ర్టానికి చెందిన స్థానిక ప్రింటర్లు పేజీ 6.6 పైసలకు కోట్‌ చేశారు. గతేడాది వరకు ప్రింటింగ్‌పై జీఎస్టీ 18 శాతం ఉండేది. ఇప్పుడు 5 శాతానికి తగ్గింది. షఫ్రాన్‌ గతేడాది జీఎస్టీ రేటునే టెండరులో పేర్కొన్నప్పటికీ నిబంధనల ప్రకారం పన్నేతర ధరను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ ప్రాతిపదికన తక్కువ ధరకు కోట్‌ చేసిన షఫ్రాన్‌ కంపెనీ ఎల్‌1గా ఎంపికైంది.

జీఎస్టీపై పొరపాటు సవరణ.. పాత జీఎస్టీ ధర పొరపాటున పేర్కొన్నామని, కొత్త రేటు ప్రకారమే ముద్రిస్తామని ఎల్‌1 కంపెనీ పాఠశాల విద్యాశాఖకు లేఖ రాసింది. దీంతో పన్నుతో కలిపి పేజీ 6.3 పైసలకే ముద్రించేందుకు టెండరు ఖరారైంది. గతేడాది పన్ను కాకుండా పేజీ 6.2 పైసలకు పుస్తకాలు ముద్రించగా, ఈ ఏడాది 6 పైసలకే టెండరు ఖరారైంది. ఫలితంగా రూ.6.5 కోట్ల వరకు నిధులు ఆదా అవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పేపరు కొనుగోళ్లలోనూ రూ.7 కోట్లు ఆదా అయ్యింది. మొత్తంగా ఈ ఏడాది రూ.13.5కోట్లు ఆదా కానున్నాయి. సుమారు 3 కోట్లకు పైగా పాఠ్యపుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరానికి ముద్రించనున్నారు. ఎల్‌1 ఖరారు తర్వాత స్థానిక ప్రింటర్లతో అధికారులు చర్చించారు. ఎవరూ నష్టపోకుండా అందరికీ ముద్రణ వర్క్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. పుస్తకాల ముద్రణ టెండర్లలో స్థానిక ప్రింటర్లకూ వర్క్‌ ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. ఏటా ఎల్‌1గా ఎవరు వచ్చినా అదే ధరకు ఇక్కడి ప్రింటర్లకే ఎక్కువ శాతం వర్క్‌ ఇస్తారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా దాదాపు 90శాతం పనులు స్థానిక ప్రింటర్లకు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహించే ఉద్దేశంతో అందరికీ కొంత భాగం పనులు ఇస్తున్నామని, అయితే ఎల్‌1 ధరకే చేయాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 03:47 AM