Share News

పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపుల్లేవు

ABN , Publish Date - May 22 , 2026 | 05:39 AM

తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌-1 గానీ, కృష్ణా ట్రైబ్యునల్‌-2 గానీ దానికి ఎలాంటి నీటి కేటాయింపులూ జరుపలేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది.

పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపుల్లేవు

  • బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ ముందు ఏపీ స్పష్టీకరణ

అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌-1 గానీ, కృష్ణా ట్రైబ్యునల్‌-2 గానీ దానికి ఎలాంటి నీటి కేటాయింపులూ జరుపలేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది. అందుచేత దానిని కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలని బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ను కోరింది. గురువారం ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లో పేర్కొన్న అంశాలకు ఎలాంటి ఆధారాల్లేవని.. పైగా తన సొంత వైఖరికే విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. మైనర్‌ ఇరిగేషన్‌లో మిగిలి ఉన్న 45 టీఎంసీలను దీనికి ఉపయోగిస్తామని డీపీఆర్‌లో పేర్కొందని.. మళ్లీ తానే శ్రీశైలంలో మిగులు జలాలపై ఆధారపడి కడుతున్నామని తెలిపిందని.. ఈ వైఖరి పరస్పర విరుద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేనేలేదన్నారు. దీనిపై తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది రవీందర్‌రావును ట్రైబ్యునల్‌ స్పష్టత కోరింది. కేటాయింపులు లేనప్పుడు కొత్త ప్రాజెక్టే కదా అని ప్రశ్నించింది. దీనికి రవీందర్‌రావు కూడా అంగీకరించారు. డిండి ఎత్తిపోతలకూ నీటి కేటాయింపులు లేవని గుప్తా తెలిపారు. శాస్త్రీయ అంచనాల్లేకుండా తెలంగాణ డీపీఆర్‌ తయారుచేసిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి హైదరాబాద్‌కు ఇప్పటికే 43 టీఎంసీలు నీరందుతోందని.. అయినా హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు అదనపు కేటాయింపులు కోరుతోందని తెలిపారు. పారిశ్రామిక వినియోగానికి రెండు కృష్ణా ట్రైబ్యునళ్లూ ప్రత్యేక నీటి కేటాయింపులు చేయలేదని.. తమకు కేటాయించిన నీటిని తాగు, ఇతర అవసరాలకు వినియోగించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చాయని పేర్కొన్నారు. ట్రైబ్యునల్‌ విచారణ శుక్రవారం కూడా ఉంది. ఏపీ వాదనలు కొనసాగనున్నాయి.

Updated Date - May 22 , 2026 | 05:40 AM