Share News

టీచర్ల బదిలీలకు మరింత సమయం

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:09 AM

ఉపాధ్యాయుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉపాధ్యాయ బదిలీల చట్టం’ ప్రకారం ఏటా వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలి.

టీచర్ల బదిలీలకు మరింత సమయం

  • జిల్లాల మధ్య విభజనకు భారీ కసరత్తు.. త్వరలో నిర్ణయం తీసుకోనున్న విద్యాశాఖ

  • డైరెక్టర్‌తో ఉపాధ్యాయ సంఘాల భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉపాధ్యాయ బదిలీల చట్టం’ ప్రకారం ఏటా వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలి. ఈ ఏడాది కొత్త జిల్లాల గెజిట్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ జిల్లాల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ మేరకు బదిలీలు జరగాలంటే టీచర్లను ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాల మధ్య విభజించాలి. ఈ ప్రక్రియకు దాదాపు 2నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా వేసవి సెలవులు ముగిసి జూన్‌లో పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో సమయం లేనందున బదిలీలు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై త్వరలో పాఠశాల విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో టీచర్లే ఎక్కువగా ఉన్నందున వారి విభజన ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలకు కేటాయింపుల్లో అభ్యంతరాలూ వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. వాటిని పరిష్కరించి తుది విభజన చేసేందుకు సమయం పడుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


954 మంది ఇంకా అక్కడే!

గతేడాది చేపట్టిన బదిలీల ప్రక్రియలో ట్రాన్స్‌ఫర్‌ అయినా కూడా పనిచేస్తున్న రిలీవ్‌ కాకుండా పాతస్థానాల్లోనే కొనసాగుతున్న టీచర్లను వెంటనే రిలీవ్‌ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సంఘాల ప్రతినిధులతో పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో సమావేశం నిర్వహించి బదిలీలు, ఇతర అంశాలపై చర్చించారు. 954 మంది టీచర్లు గతేడాది బదిలీ అయినప్పటికీ తమస్థానాల్లో వేరే వారు(రిలీవర్లు) లేరనే కారణంతో అక్కడే కొనసాగుతున్నారని, వారిని రిలీవ్‌ చేయాలని కోరారు. బదిలీలపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని డైరెక్టర్‌ చెప్పారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న రవాణా అలవెన్స్‌లు విడుదల చేయాలని, ఎస్జీటీ నుంచి భాషా సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులు పూర్తిచేయాలని సంఘాల ప్రతినిధులు కోరారు.

Updated Date - Apr 25 , 2026 | 05:09 AM