Share News

టీచర్‌ రుచి చూశాకే.. పిల్లలకు!

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:01 AM

బడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కచ్చితంగా ఆ బడిలోని టీచర్‌ రుచి చూశాకే..

టీచర్‌ రుచి చూశాకే.. పిల్లలకు!

  • ‘ఓకే’ అంటేనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఉపాధ్యాయుల్లో రోజుకొకరికి బాధ్యత

  • పిల్లల తల్లిదండ్రుల నుంచీ ఫీడ్‌బ్యాక్‌ సేకరణ.. మంత్రి లోకేశ్‌ సూచనతో ఆదేశాలు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): బడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కచ్చితంగా ఆ బడిలోని టీచర్‌ రుచి చూశాకే.. పిల్లలకు భోజనం వడ్డించాలని మధ్యాహ్న భోజన విభాగం డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. మధ్యాహ్న భోజనం అధ్వానం అంటూ ఇటీవల మైలవరంలోని ఓ పాఠశాల హెచ్‌ఎం డ్రామా ఆడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్‌ మంగళవారం ఆ స్కూల్‌ను పరిశీలించి.. భోజనం బాగుందని చెప్పారు. అయినా నాణ్యతలో ఎక్కడా రాజీ ఉండకూడదని ఆదేశించారు. దీంతో మధ్యాహ్న భోజన విభాగం తాజా ఆదేశాలు జారీచేసింది.


అన్నింటి నాణ్యత పరిశీలన..

  • భోజనం రుచి చూడటానికి హెచ్‌ఎం రోజుకొక టీచర్‌ను కేటాయించాలి. ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు పెట్టక ముందే ఆ భోజనాన్ని రుచి చూడాలి.

  • ముఖ్యంగా అన్నం, కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ నాణ్యతను పరిశీలించాలి. అనంతరం లీప్‌ యాప్‌లో ఫీడ్‌ బ్యాక్‌ నమోదు చేయాలి. ‘గుడ్‌’ లేదా ‘బ్యాడ్‌’ నమోదు చేసి సబ్మిట్‌ చేయాలి.

  • టీచర్‌ ‘గుడ్‌’ అని ఫీడ్‌బ్యాక్‌ ఇస్తేనే ఆ భోజనాన్ని పిల్లలకు వడ్డిస్తారు.

తల్లిదండ్రుల నుంచీ ఫీడ్‌బ్యాక్‌

ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నారు. తల్లిదండ్రులు లీప్‌ యాప్‌లోనే లాగిన్‌ అయి వివరాలు ఇవ్వొచ్చు. మీ పిల్లలు మధ్యాహ్న భోజనం తింటున్నారా? నాణ్యత బాగుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయొచ్చు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిప్రాయాల ఆధారంగా మధ్యాహ్న భోజనంపై అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.

Updated Date - Mar 18 , 2026 | 04:02 AM