Share News

టెట్‌ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలి

ABN , Publish Date - May 31 , 2026 | 05:52 AM

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతులు పొందాలన్నా టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అన్న సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని...

టెట్‌ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలి

  • ఏపీ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

విజయవాడ, మే 30 (ఆంధ్రజ్యోతి): ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతులు పొందాలన్నా టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అన్న సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావులు తెలిపారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒకవైపు రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు వంటి ఉద్యోగులు జూనియర్‌ లెక్చరర్లుగా, ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతులు పొందుతున్నారని... మరోవైపు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల అనుభవం కలిగిన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు పదోన్నతులు పొందేందుకు టెట్‌ తప్పనిసరి చేయడం అన్యాయమని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ, ఉత్తమ ఫలితాలు సాధనలో కీలకంగా ఉన్న ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా టెట్‌తో అడ్డుకట్ట వేయడం సరైన విధానం కాదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై సానుకూల దృక్పథంతో స్పందించి, ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ విషయంలో మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ తరపున ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - May 31 , 2026 | 05:54 AM