చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:23 AM
రాష్ట్ర ప్రభుత్వం 11 వేల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ను పునరుద్ధరించడంపై 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
11 వేల మందికి పాత పెన్షన్ అమలు నిర్ణయంపై ఉపాధ్యాయుల హర్షం
జేఏసీ చైర్మన్ విద్యాసాగర్‌కు సన్మానం
విజయవాడ(గాంధీనగర్), జూన్ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 11 వేల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ను పునరుద్ధరించడంపై 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, పెన్షన్ సాధనలో కీలకపాత్ర పోషించిన ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్‌కు కృతజ్ఞతా సభ గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో శుక్రవారం నిర్వహించారు. తొలుత సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ, ‘పెన్షన్ ఉద్యోగుల సామాన్య హక్కు. కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం చూడకుండా 11 వేల మందికి పాత పెన్షన్ మంజూరు చేయడం హర్షణీయం’ అని అన్నారు. ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ... జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ కృషి వల్లనే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్లు కేఎల్ శ్రీనాథ్, తమ్ము నాగరాజు, అబ్దుల్ నయీమ్, సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ, గతంలో సీఎంగా చంద్రబాబు సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, డెత్ కం రిటైర్మెంట్ గ్రాట్యూటీ ఉత్తర్వులను ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ను ఘనంగా సత్కరించారు.