Share News

పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:37 AM

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బదిలీలపై నిషేధం ఉన్నందున ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు

  • బదిలీలపై నిషేధంతో ప్రత్యామ్నాయ చర్యలు

  • 20 నాటికి బడుల్లో విద్యార్థుల సంఖ్య ప్రామాణికం

  • తొలుత జూనియర్‌ మోస్ట్‌ టీచర్లకు వర్తింపు

  • ముందుకొస్తే సీనియర్‌ టీచర్లకూ ప్రాధాన్యం

  • మండల, డివిజన్‌ స్థాయిలోనూ సర్దుబాటు

  • 30 నాటికి ప్రక్రియ పూర్తి: విద్యాశాఖ

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బదిలీలపై నిషేధం ఉన్నందున ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఆ శాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికోసం పాఠశాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు చేస్తారు. ఈ నెల 20 నాటికి బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియ చేపడతారు. విద్యార్థులు తగ్గిన పాఠశాలల్లోని టీచర్లను పిల్లలు పెరిగిన స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. గతంలో జారీ చేసిన జీవోలు 21, 33 ఆధారంగానే ఈ సర్దుబాటు జరుగుతుంది. హిందీ, ఇంగ్లిష్‌, గణితం, బయాలజీ, సోషల్‌ స్టడీస్‌, ఫిజికల్‌ సైన్స్‌, తెలుగు సబ్జెక్టుల వారీగా సర్దుబాటు ప్రాధాన్య క్రమం నిర్ణయిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్న మిగులు ఎస్జీటీలను తొలుత మండల పరిధిలోనే సర్దుబాటు చేస్తారు. మండలంలో ఖాళీలేకపోతే డివిజన్‌ స్థాయిలో చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో... హైస్కూల్‌ ప్లస్‌లలో ఏదైనా గ్రూపులో విద్యార్థులు లేకపోతే ఆ గ్రూపునకు కేటాయించిన టీచర్లు మిగులు అవుతారు. వీరిని కూడా తొలుత మండల పరిధిలో సర్దుబాటు చేస్తారు. అక్కడ ఖాళీలు లేకపోతే డివిజన్‌ స్థాయిలో సర్దుబాటు చేస్తారు.


మిగులు టీచర్లుగా జూనియర్లు

ప్రతి పాఠశాలలో అత్యంత జూనియర్‌ టీచర్‌ను మిగులు టీచర్‌గా గుర్తిస్తారు. ఒకవేళ సీనియర్‌ టీచర్‌ స్వచ్ఛందంగా ముందుకొస్తే వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఒకే డీఎస్సీలోని టీచర్లయితే మెరిట్‌ ఆధారంగా సీనియారిటీ నిర్ణయిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్లను మైదాన ప్రాంతాలకు సర్దుబాటు చేయకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్‌ 30లోగా రిటైరయ్యే టీచర్లకు సర్దుబాటు మినహాయింపు ఉండదు. ఈ ఏడాది జూలై 31 వరకు సెలవులో ఉన్న టీచర్ల స్థానాలను ఖాళీలుగా చూపరు. తర్వాత కూడా సెలవులో ఉన్న టీచర్ల స్థానాలను ఖాళీలుగా చూపించి సర్దుబాటు చేస్తారు. తొలుత పాఠశాల విద్య ఐటీ విభాగం ఈ నెల 20 వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రదర్శిస్తుంది. మంజూరైన టీచర్‌ పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్నవారు, మిగులు లేదా కొరత వివరాలు కూడా చూపిస్తుంది. తర్వాత మండల స్థాయిలో ఎంఈవో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మొదట మిగులు టీచర్ల జాబితాలు ప్రదర్శించి, కౌన్సెలింగ్‌ చేపడతారు. మిగులు టీచర్లు కోరుకున్న పాఠశాలలు కేటాయిస్తారు. తొలుత స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు అదే మేనేజ్‌మెంట్‌లో సర్దుబాటు చేశాక ఇతర మేనేజ్‌మెంట్లలో సర్దుబాటు చేస్తారు. మండల కౌన్సెలింగ్‌ తర్వాత ఇంకా టీచర్లు ఉంటే డివిజన్‌ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. మొత్తం ప్రక్రియ ముగిసిన తర్వాత డీఈవో లీప్‌ యాప్‌ ద్వారా సర్దుబాటు ఆర్డర్లు జారీ చేస్తారు.

Updated Date - Jun 24 , 2026 | 04:41 AM