Share News

5 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం!

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:36 AM

గ్రామ పంచాయతీల ఆదాయం పెంచి.. వాటిని స్వయం సమృద్ధివైపు నడిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ద్వారానే కాకుండా...

5 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం!

  • గ్రామ పంచాయతీల సుస్థిరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

  • మొక్కల పెంపకంతో ఆదాయం పెంచే యోచన

  • చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి ప్రోత్సాహం

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు

  • ఐదుగురు డీపీవోలతో సాధికార కమిటీ ఏర్పాటు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీల ఆదాయం పెంచి.. వాటిని స్వయం సమృద్ధివైపు నడిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ద్వారానే కాకుండా... మొక్కల పెంపకం, చెరువులు, కుంటల్లో చేపల పెంపకం వంటి అంశాలపైనా దృష్టిపెట్టి ఆదాయం పెంచుకోవాలని యోచిస్తోంది. గతంలో గ్రామ పంచాయతీల రాబడి ఏటా రూ.400 కోట్లకు మించేది కాదు. అయితే కమిషనర్‌ కృష్ణతేజ స్వర్ణపంచాయతీ పోర్టల్‌ తీసుకొచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ఆదాయం ఏకంగా రూ.1100 కోట్లకు చేరింది. దీంతో అధికార వర్గాల్లో కూడా జోష్‌ వచ్చింది. గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ ఆదాయాన్ని ఏటా రూ.5 వేల కోట్ల వరకూ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీల్లో పన్నుల చెల్లింపు విధానం సక్రమంగా లేదు. ప్రతి ఏటా పంచాయతీరాజ్‌శాఖ అసె్‌సమెంట్‌లు విధించి పన్నుల వసూలు చేపట్టినా అవన్నీ మొక్కుబడిగా జరిగేవి. అధికారులు టార్గెట్లు పెట్టి పంచాయతీ కార్యదర్శు (పీఎ్‌స)లపై ఒత్తిడి చేస్తే వాళ్లు బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ చేసేవారు. పంచాయతీల్లో కుటుంబాల నామమాత్రపు ఆస్తి పన్నులు పీఎ్‌సలే చెల్లించి ట్రెజరీకి జమ చేసేవారు. ఆ నిధులు మళ్లీ గ్రామ పంచాయతీల ఖాతాలోకి రాగానే... ఏదో ఒక పని చేశామని చూపించి వాటిని డ్రా చేసుకునేవారు. దీంతో ఎన్ని సంవత్సరాలైనా పంచాయతీల ఆదాయం పెరిగేది కాదు. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ వచ్చాక ఈ జాఢ్యం నుంచి పంచాయతీలు బయటపడ్డాయి. ఒకే ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించడంతో.. పంచాయతీల్లో సమగ్ర పాలన అందించడం ద్వారా గ్రామ సీమలు స్వయం సమృద్ధి సాధిస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇటీవల గ్రామ పంచాయతీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దీనిపై పక్కా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.


పన్ను ఎగవేతదారులకు చెక్‌..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలోని విద్యాసంస్థలు, పరిశ్రమలు, హేచరీ్‌సలలో పన్ను ఎగవేతదారులకు గుర్తించేందుకు డిప్యూటీ సీఎం ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)తో సాధికార కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పంచాయతీల పరిధిలోని విద్యాసంస్థలు, పరిశ్రమలు, హేచరీ్‌సలు వాస్తవంగా ఎంత పన్ను చెల్లించాలి.. ఎంత చెల్లిస్తున్నాయి..? వాటికి అందిస్తున్న మౌలిక సదుపాయాలు ఏమిటి.. తదితర వివరాలను అధ్యయనం చేస్తుంది. పన్ను చెల్లింపుల్లో తేడాలుంటే ఆయా సంస్థల నుంచి అదనపు పన్నులు వసూలు చేయాలని సూచిస్తుంది. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడులకు తావివ్వకుండా కచ్చితమైన రూల్స్‌ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. అలాగే ఇళ్లు నిర్మించుకునేవారికి అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆయా అసె్‌సమెంట్‌లపై పారదర్శకంగా పన్నుల విధానం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. పంచాయతీల్లో లేఅవుట్లకు సంబంధించి పట్టణాభివృద్ధి అథారిటీలు అనుమతి ఇస్తున్నాయి. అవి వసూలు చేసే పన్నుల్లో రావాల్సిన వాటా పంచాయతీలకు రావడం లేదని కొందరు డీపీవోలు ఇప్పటికే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్‌ మంత్రి నారాయణతో చర్చించి, అవసరమైతే క్యాబినెట్‌లో ఈ అంశం ప్రస్తావించి పంచాయతీలకు రావాల్సిన నిధులు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. సీనరేజ్‌ నిధులు కూడా పంచాయతీల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.


మొక్కల పెంపకం బాధ్యత పంచాయతీలకు...

ఆదాయ వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని సగానికిపైగా గ్రామ పంచాయతీలు కచ్చితమైన ప్రణాళికలు లేక ఎదుగూబొదుగూ లేకుండా ఉన్నాయి. అలాంటి పంచాయతీల్లో కొన్నిరకాల పనులు చేపట్టడం ద్వారా ఆదాయం పెంచవచ్చని పంచాయతీరాజ్‌ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలో 2 వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటారు. ఈ మొక్కలు పెరిగిన తర్వాత వాటి నుంచి వచ్చే కలపతో పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటారు. వీబీజీరామ్‌జీ పథకం ద్వారా ప్రతి పంచాయతీల్లో మొక్కలు నాటుతారు. ఆ మొక్కలను బతికించే బాధ్యత పంచాయతీ ఉద్యోగులకు అప్పగిస్తారు. ఈ మొక్కల అందించేందుకు అవసరమైన నర్సరీల ఏర్పాటుకు వీబీజీరామ్‌జీ ద్వారా అటవీశాఖకు ఇప్పటికే నిధులు మంజూరు చేశారు. అటవీశాఖ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నాయి. కోనసీమ, కోస్తా జిల్లాల్లో పంచాయతీ భూముల్లో కొబ్బరి మొక్కలు నాటడం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవచ్చని చెబుతున్నారు. చాలా గ్రామాల్లో కుంటలు, చెరువులల్లో చేపలు, రొయ్యల పెంపకం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.

విలేజ్‌ టూరిజంపై ప్రణాళికలు..

ఇటీవల సోషల్‌ మీడియా ప్రభావంతో విలేజ్‌ టూరిజానికి ప్రాచుర్యం లభించింది. చాలా గ్రామాల్లో చెరువులు, నది పరీవాహక ప్రాంతాలు, కొండలను టూరిజం స్పాట్‌లుగా గుర్తిస్తే.. ఆయా పంచాయతీలు ఆదాయాలు పెంచుకునే అవకాశముంది. టూరిజం శాఖతో సమన్వయం చేసుకుని విహారానికి వచ్చే జనసందోహం ఏయే పంచాయతీల్లో ఉందో గుర్తిస్తారు. ఆయా పంచాయతీల్లో టూరిజం శాఖతో కలిసి సౌకర్యాలు ఏర్పాటుచేసి ఆయా టూరిజం స్పాట్లను ఆదాయం వనరులుగా మార్చుకునే ప్రయత్నాలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టనుంది.

Updated Date - Jun 07 , 2026 | 05:37 AM