Share News

సర్వేయర్లపై సస్పెన్షన్ల ఎత్తివేత

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:39 AM

సర్వే శాఖలో అధికారులు సృష్టించిన కల్లోలం సద్దుమణిగింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ జోక్యంతో 56 మంది సర్వేయర్లపై విధించిన సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది.

సర్వేయర్లపై సస్పెన్షన్ల ఎత్తివేత

  • 56 మందిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు

  • సర్వేయర్లకు ల్యాప్‌టా్‌పలు, ఇతర పరికరాలు

  • రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడి

అమరావతి, మార్చి14(ఆంధ్రజ్యోతి): సర్వే శాఖలో అధికారులు సృష్టించిన కల్లోలం సద్దుమణిగింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ జోక్యంతో 56 మంది సర్వేయర్లపై విధించిన సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. వారిపై క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించింది. 28 జిల్లాల గ్రామ సర్వేయర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను విధుల్లోకి తీసుకుంటూ సర్వే, సెటిల్‌మెంట్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు, ఇతర సిబ్బందితో సమానంగా తమకు బేసిక్‌ పే రూ.30వేలకు పెంచాలని, గేడ్ర్‌-1 పదోన్నతులు, టెక్నికల్‌ అలవెన్సులు ఇవ్వాలని, రీసర్వే విధుల నిర్వహణకు ల్యాప్‌టాప్‌, రోవర్లు, ఇతర సామగ్రి అందించాలని, బకాయిలు చెల్లించాలని కోరుతూ సర్వేయర్లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ డిమాండ్లపై సమ్మె చేయాలని నిర్ణయించారు. వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేయాల్సిన రెవెన్యూ, సర్వే శాఖల ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. మంత్రికి మాట మాత్రం చెప్పకుండా నిర్ణయాలు తీసుకొన్నారు. ఆందోళనలో ఉన్న సర్వేయర్ల సంఘం జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు 56 మందిని సస్పెండ్‌ చేశారు. తనకు తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ అధికారులపై మంత్రి సీరియస్‌ అయ్యారు. గత మంగళవారం సర్వేయర్ల సంఘం ప్రతినిధులను అమరావతికి పిలిపించి చర్చలు జరిపారు. అనంతరం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ జయలక్ష్మితో అనగాని సమావేశమయ్యారు.


సర్వేయర్లపై క్రమశిక్షణ చర్యలు తొందరపాటు చర్య అని, వెంటనే వాటిని వెనక్కి తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 56 మందిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సర్వేశాఖ శుక్ర, శనివారాల్లో ఉత్తర్వులు జారీ చేసింది. వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లుగా సర్వే, సెటిల్‌మెంట్‌ జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ)లు శనివారం ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. వారంతా తిరిగి విధుల్లో చేరారని ప్రధాన కార్యాలయానికి, రెవెన్యూ మంత్రికి అధికారులు నివేదించారు. మరోవైపు ఇదే విషయమై సర్వేయర్ల సంఘం నేతలతో అనగాని మాట్లాడినట్లు తెలిసింది. ఇచ్చిన మాట మేరకు క్రమశిక్షణ చర్యలు ఎత్తివేసినందున, గ్రామ సర్వేయర్లు అంకితభావంతో రీసర్వే పనుల్లో పాల్గొనాలని సూచించారు. ఇదిలా ఉండగా, గ్రామ సర్వేయర్ల డిమాండ్లను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్లు తెలిసింది. సర్వే సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ కూర్మనాథ్‌ నుంచి దీనికి సంబంధించిన ఫైలు తొలుత సీసీఎల్‌ఏ జయలక్ష్మికి, అక్కడి నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ పరిశీలనకు పంపినట్లు సమాచారం. బేకిస్‌ పే పెంపు, ఇతర ఆర్థిక డిమాండ్లపై ఆర్థిక శాఖతో చర్చించి రెవెన్యూ శాఖ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉంటే, రీసర్వే విధుల్లో ఉన్న గ్రామ సర్వేయర్లకు సాంకేతికంగా ఉపయోగపడే ల్యాప్‌టా్‌పలు, రోవర్లు, ఇతర వనరులు కల్పిస్తామని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు అనగాని వెల్లడించారు.

Updated Date - Mar 15 , 2026 | 04:39 AM